హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ భయం.. అక్కంపల్లి రిజర్వాయర్​లో కోళ్ల కళేబరాలు

హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు నల్గొండలోని 600 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లు తేలుతూ కనిపించడం కలకలం రేపింది.

By అంజి  Published on  15 Feb 2025 4:14 PM IST
Bird flu scare, Hyderabad, Dead chickens,Akkampally reservoir

హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ భయం.. అక్కంపల్లి రిజర్వాయర్​లో కోళ్ల కళేబరాలు 

హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు నల్గొండలోని 600 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లు తేలుతూ కనిపించడం కలకలం రేపింది. ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఫిబ్రవరి 13, గురువారం అక్కంపల్లి జలాశయంలో చనిపోయిన కోళ్లు తేలుతూ కనిపించాయి. మృతి చెందిన కోళ్లను రిజర్వాయర్​లో పడేశారని స్థానికలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై పెద్ద అడిశర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులు జలాశయాన్ని పరిశీలించారు, ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై డ్రోన్ సర్వే నిర్వహించి ఉన్నత స్థాయి విచారణ ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని కోళ్ల పెంపక కేంద్రాలను కూడా పరిశీలించారు. చనిపోయిన కోళ్లను జలాశయంలో పడేసిన పడమటి తండాకు చెందిన రామావత్‌ రాజమల్లును అరెస్ట్‌ చేసినట్లు దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక తెలిపారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) నీటి వినియోగం యొక్క భద్రత, దాని కాలుష్యంపై పరీక్షలు చేసింది. ఆ నీరు వినియోగానికి సురక్షితమని కనుగొంది. ఐఎస్‌ ప్రమాణాల ప్రకారం ట్రిపుల్ క్లోరిన్ ప్రక్రియను ఉపయోగించి నీటిని శుద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. నీటి సరఫరాలో 0.5 ppm క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది.

బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ నుంచి కోళ్లు హైదరాబాద్‌లోకి ప్రవేశించకుండా నిషేధం

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (HPAI) కేసులు నమోదైన తర్వాత హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ భయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 11న, తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు HPAI నివారణ గురించి కోళ్ల పెంపకందారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నోటీసు జారీ చేసింది.

తెలంగాణలోకి ప్రవేశించే అన్ని కోళ్ల వాహనాల కదలికలను పశుసంవర్ధక శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు ఏవీ గుర్తించబడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు గుర్తించిన దృష్ట్యా, ఫిబ్రవరి 12న తెలంగాణ పోలీసులు సూర్యాపేట జిల్లాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి కోళ్లను తీసుకెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి తిప్పి పంపారు.

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక మంత్రి కె. అచ్చెన్నాయుడు పుకార్లపై స్పందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభావిత కోళ్ల కేంద్రాలను రెడ్ జోన్‌లోకి తీసుకువచ్చామని, 10 కిలోమీటర్ల పరిధిలోని చికెన్ దుకాణాలను మూసివేస్తున్నామని చెప్పారు. ఈ వ్యాధిని నియంత్రించడానికి వేగవంతమైన ప్రతిస్పందన బృందాలు (RRTలు) తక్షణ చర్యలు తీసుకుంటున్నాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు.

హైదరాబాద్ జూ పార్క్‌లో కోడి మాంసం, గుడ్ల సరఫరా నిలిచిపోయింది.

పొరుగు రాష్ట్రాలలో అనుమానిత ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, అంటే బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోయాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని జూ పార్క్ మాంసాహారం తినే జంతువులకు కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేసింది.

గతంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ పులులు, సింహాలు, పాంథర్లు, జాగ్వర్లు వంటి మాంసాహార జంతువులకు రోజుకు 35 కిలోల కోడి మాంసం, 140 గుడ్లు తినేవి. ఇప్పుడు మాంసం తినే జంతువులకు బదులుగా మటన్, గొడ్డు మాంసం, పంది మాంసం ఇస్తున్నట్లు అధికారులు పిటిఐకి తెలిపారు.

Next Story