హైదరాబాద్ నగరంలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఇది. రెండు రోజుల పాటు నగరంలోని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శ్రీరామనవమి వేడుకల కారణంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఆదిబాద్ జిల్లా భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసుల మార్గదర్శకాల మేరకు హైదరాబాద్, భైంసాలో శోభాయాత్ర నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. శోభాయాత్రలో 200 మంది లోపు మాత్రమే పాల్గొనాలని సూచించింది. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శోభాయాత్రలో ఎలాంటి సంఘటనలు జరిగినా కేసులు నమోదు చేయాలని సూచించింది. శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని హిందూవాహిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిని న్యాయస్థానం బైంసా పట్టణం నుంచి పురానా బజార్ వరకు యాత్రకు అనుమతి ఇచ్చింది.