IFHE యాజమాన్యం స్పందన: విద్యార్థుల మధ్య గొడవకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

Behind the scenes IFHE authorities explain events preceding student clash case.IFHE లో 'లా' మొదటి సంవత్సరం చదువుతున్న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2022 5:04 AM GMT
IFHE యాజమాన్యం స్పందన: విద్యార్థుల మధ్య గొడవకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

IFHE (బిజినెస్ అండ్ లా స్కూల్స్) లో 'లా' మొదటి సంవత్సరం చదువుతున్న హిమాంక్ బన్సాల్‌ను కొట్టి వేధించినందుకు 12 మంది విద్యార్థులు క్రమశిక్షణా కారణాలపై నవంబర్ 10న సస్పెండ్ అయ్యారు. శంషాబాద్ డీసీపీ ఆర్.జగదీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొదట ఓ అమ్మాయిని ఆటపట్టించడం కారణంగా ఈ గొడవలకు దారి తీసింది.

ఇన్‌స్టిట్యూషన్ సిబ్బందిని, అధికారులను న్యూస్‌మీటర్ బృందం సంప్రదించింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రాకముందు జరిగిన సంఘటనలను తెలుసుకోవడానికి ప్రయత్నించాము.

ఇన్‌స్టిట్యూషన్‌ హాస్టల్‌లో ఘటనలు:

నవంబర్ 1: మధ్యాహ్నం 3:30 గంటలకు, దొంతనపల్లిలోని ఐఎఫ్‌హెచ్‌ఈలోని లా కాలేజీ హాస్టల్ గదిలో 15-20 మంది అబ్బాయిలు కలిసి హిమాంక్ బన్సల్ అనే బాలుడిని శారీరకంగా వేధించారు. అతని ముఖంపై కొట్టడం, అతని పొత్తికడుపు ప్రాంతంపై తన్నడం, అతని ప్రైవేట్ పార్ట్ లను తాకడం, పౌడర్లు తినమని బలవంతం చేయడం వంటివి చేశారు.

హిమాంక్ ఫిర్యాదు ఆధారంగా, అతను ఓ అమ్మాయితో మాట్లాడినప్పుడు కొన్ని దైవదూషణ వ్యాఖ్యలను చేసినందుకు అబ్బాయిలు అతనిని వేధించారు. ఈ ప్రైవేట్ సంభాషణలు సోషల్ మీడియాలో పబ్లిక్‌గా మారడమే కాకుండా వైరల్ అయ్యాయి.

నవంబర్ 3: ర్యాగింగ్ ఘటనపై హిమాంక్ బన్సల్ IFHE, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, తెలంగాణ ప్రభుత్వానికి ఇమెయిల్ పంపాడు. దూషణాత్మకమైన వ్యాఖ్య చేసినందుకు చింతిస్తున్నట్లు కూడా చెప్పారు.

9 నవంబర్: తాను తొందరపడి ఫిర్యాదు చేశానని, ఇది వ్యక్తుల మధ్య జరిగిన గొడవ అని హిమాంక్ కాలేజీ, UGC, రాష్ట్ర ప్రభుత్వానికి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. ఇది ర్యాగింగ్ కేసు కాదని కూడా హిమాంక్ పేర్కొన్నాడు. ఇంతలో.. కళాశాల యాజమాన్యం ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఇంటర్ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 12 మంది విద్యార్థులను విచారించారు.

10 నవంబర్: కళాశాల యాజమాన్యం మొత్తం 12 మంది విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలను పంపింది, వారిని 2022-23 అకడమిక్ సెషన్ నుండి బహిష్కరించింది. సంస్థ అధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో "ఇన్‌స్టిట్యూషన్ చిత్తశుద్ధితో వ్యవహరించింది. సంబంధిత 12 మంది విద్యార్థులను తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అటువంటి అవాంఛనీయ చర్యల పట్ల సంస్థ ఎవరినీ ఉపేక్షించదు" అని పేర్కొంది. ఇందులో హిమాంక్, అమ్మాయితో పాటు అతనిని కొట్టిన ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు.

నవంబర్ 11: ఈ ఘటనపై హిమాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిమాంక్ బన్సాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖ, అతడిని కొట్టిన వీడియోతో సోషల్ మీడియా నిండిపోయింది. తాము విద్యార్థుల మీద తగిన చర్యలు తీసుకున్నా కూడా హిమాంక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై తాము ఆశ్చర్యపోయామని.. సోషల్ మీడియాలో వీడియోను చూసి తాము ఆశ్చర్యపోయామని కళాశాల అధికారులు తెలిపారు. తనకు, హిమాంక్‌కి మధ్య జరిగిన పరస్పర వివాదాల గురించి అమ్మాయి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని కూడా కాలేజీ యాజమాన్యం తెలిపింది.

పోలీసుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ చేపట్టి ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది కాలేజీ మేనేజ్‌మెంట్ సిబ్బందిపై భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 41A కింద కేసు నమోదు చేయబడింది. పోలీసులు కేసు పెట్టడంతో విద్యార్థులు ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షకు గురవుతారు.

ఈ సంఘటనకు మతపరమైన సంబంధం లేదని, అబ్బాయి - అమ్మాయి మధ్య వ్యక్తిగత సంభాషణ ఫలితంగా ఈ గొడవ జరిగిందని కళాశాల అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాలే ఈ ఘటనపై ఊహాగానాలకు తెరతీసి మతపరమైన కోణాన్ని తీసుకుని వచ్చాయని వారు తెలిపారు.

సంస్థ ద్వారా తగిన చర్యలు:

హాస్టళ్లలో అంతస్తుల వారీగా భద్రత, క్యాంపస్‌లోని విద్యార్థులకు కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేస్తామని కాలేజీ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కథనాన్ని కనిజా గరారి, నిమిషా ఎస్ ప్రదీప్ సంయుక్తంగా రాశారు.

Next Story