హైదరాబాద్ : ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో భారతదేశానికి తిరిగొచ్చిన, నియో -జెడ్‌ఎస్‌ఎం యూనివర్సిటీ ఎన్‌ఈఓ ఇనిసిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చదువుతున్న వైద్య విద్యార్థు లు పట్టభద్రులయ్యారు. వీరిలో 72 మంది విద్యార్థులు ఎన్‌ఎంసీ రిజిస్ట్రేషన్ కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ పరీక్షలో (ఎఫ్‌ఎంజీఈ) ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన 2022 గ్రాడ్యుయేషన్, సక్సెస్ మీట్ లో ఎఫ్ఎంజీఈలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డితో కలిసి విద్యార్థులకు పట్టాలను, ఎఫ్‌ఎంజీఈ పాస్‌పై బంగారు పతకాలు, కొవిడ్ వారియర్, ఎవాక్యుయేషన్ బ్రేవరీ అవార్డులతో సత్కరించారు.
అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కావాలన్న ఆకాంక్షతో చాలా మంది మధ్య తరగతి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు వెలుతున్నారు. ఇదే క్రమంలో ఉక్రెయిన్‌కు వెళ్లిన విద్యార్థులను యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా పేరిట అక్కడున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్లు చెప్పారు. మధ్యలోనే మెడికల్ విద్యను వదిలి దేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ విద్యను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎఫ్‌ఎంజీఐ పరీక్షలను అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరత రాకుండా మెడికల్ కాలేజీలతో పాటు సీట్ల పెంపునకు కృషి చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి, పి.విజయబాబు, డాక్టర్ దివ్య రాజ్ రెడ్డి, డాక్టర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.