ఆ ఏటీఎంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500.. బారులు తీరిన జనం
Atm Dispenses 5 times extra cash. కోరుకున్న నగదు కంటే దాదాపు ఐదు రెట్లు నగదు వచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2023 2:32 AM GMTఓ వ్యక్తి నగదు కోసం ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అతడు కోరుకున్న నగదు కంటే దాదాపు ఐదు రెట్లు నగదు వచ్చింది. మరొకరు అయితే ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు నగదు విత్ డ్రా చేసేవారు. కానీ అతడు నిజాయతీ గల వ్యక్తి అందుకనే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకుంది.
మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిబౌలి చౌరస్తాలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం ఉంది. మంగళ వారం రాత్రి శాలిబండకు చెందిన ఓ వ్యక్తి ఏటీఎంకు వెళ్లి రూ.500 విత్ డ్రా చేశాడు. అయితే.. అతడికి రూ.500కు బదులుగా రూ.2500 వచ్చాయి. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అతడి కంటే ముందు ఎంత మంది డ్రా చేసుకున్నారో తెలీదు గానీ, అప్పటికే ఆ విషయం తెలుసుకున్న జనాలు ఆ ఏటీఎం కేంద్రానికి క్యూ కట్టారు.
అక్కడకు చేరుకున్న ఇన్‌స్పెక్టర్ శివకుమార్ జనాన్ని క్లియర్ చేశారు. తరువాత ఏటీఎం సెంటర్‌లోపలికి వెళ్లి పరిశీలించగా రూ.500 బదులుగా రూ.2500 రావడం గుర్తించారు. వెంటనే ఏటీఎం సెంటర్ క్లోజ్ చేసి సదరు బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగి ఉంటుందని బావిస్తున్నారు.