హైదరాబాద్: మద్యం సేవించి పబ్లిక్ ప్లేసుల్లో అదుపు తప్పుతున్న మందుబాబులకు వెస్ట్ జోన్ పోలీసులు షాక్ ఇచ్చారు. పార్క్‌లు, చెరువుల దగ్గర మద్యం సేవిస్తూ పట్టుబడిన వారికి ఈ సారి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక శిక్ష అమలు చేశారు. వెస్ట్‌జోన్ పరిధిలోని వివిధ పార్క్‌ల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన 40 మంది వ్యక్తులకు కోర్టు సామాజిక సేవ శిక్ష విధించింది.
శిక్షలో భాగంగా వారు మద్యం సేవించిన అదే పార్క్‌లు, చెరువులను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో వెంగల్ రావు నగర్ పార్క్‌లో ఉన్న చెరువును సహా అనేక పార్క్‌లలో ఈ మందుబాబులతోనే శుభ్రపరిచే పనులు జరిపిస్తున్నారు. చెత్త, ప్లాస్టిక్, మద్యం సీసాలు.. ఇవన్నీ తొలగించేందుకు గంటల పాటు వారికి పనిచేయించగా, ఈ చర్యతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
పార్క్‌ల్లో మద్యం సేవించడం ప్రజా అసౌకర్యం, పర్యావరణ కాలుష్యం, కుటుంబాలకు ఇబ్బందులకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఇకపై పార్క్‌లు లేదా చెరువుల దగ్గర మద్యం సేవిస్తే ఇదే విధంగా సామాజిక సేవ శిక్ష తప్పదని వారు స్పష్టంచేశారు.