హైదరాబాద్‌లో విషాదం..అపార్ట్‌మెంట్ బాల్కనీ స్లాబ్ ఇద్దరు మృతి

హైదరాబాద్‌ పంజాగుట్టలో ఆదివారం ఒక అపార్ట్‌మెంట్‌ బాల్కనీ స్లాబ్‌ కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు దుర్మరణం చెందారు.

By -  Knakam Karthik
Published on : 22 March 2026 5:40 PM IST

Hyderabad News, Panjagutta, Apartment Accident, Slab Collapse, Tragedy, Electricians Death

హైదరాబాద్‌లో విషాదం..అపార్ట్‌మెంట్ బాల్కనీ స్లాబ్ ఇద్దరు మృతి

హైదరాబాద్‌ పంజాగుట్టలో ఆదివారం ఒక అపార్ట్‌మెంట్‌ బాల్కనీ స్లాబ్‌ కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు దుర్మరణం చెందారు. కుందన్‌బాగ్‌లోని మెథడిస్ట్ కాలనీలో ఉన్న శ్రీవత్స అపార్ట్‌మెంట్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. సీతారాంబాగ్‌కు చెందిన దేవిదాస్ (56), అతని అల్లుడు వివేక్ (32) ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో ఉన్న తన నివాసంలో మరమ్మతు పనుల కోసం యజమాని ద్వారకా ప్రసాద్ వీరిద్దరిని పిలిపించారు. ముగ్గురూ కలిసి మూడవ అంతస్తు బాల్కనీలో నిలబడి పనుల గురించి చర్చిస్తుండగా, ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. దీంతో ముగ్గురూ అమాంతం కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన దేవిదాస్, వివేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, యజమాని ద్వారకా ప్రసాద్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యజమానిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపారు. భవన నిర్మాణం పాతది కావడం లేదా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story