కుక్క దాడి.. మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
హైదరాబాద్‌లోని మణికొండలోని పంచవటి కాలనీలోని ఓ ఫ్లాట్‌లో పెంపుడు జంతువు లాబ్రోడార్ కుక్క దాడి చేయడంతో అమెజాన్ డెలివరీ బాయ్
By అంజి Published on 22 May 2023 1:45 PM IST
కుక్క దాడి.. మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
హైదరాబాద్‌లోని మణికొండలోని పంచవటి కాలనీలోని ఓ ఫ్లాట్‌లో పెంపుడు జంతువు లాబ్రోడార్ కుక్క దాడి చేయడంతో అమెజాన్ డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30-1 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డెలివరీ బాయ్‌ను 27 ఏళ్ల మహమ్మద్ ఇలియాస్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఫ్లాట్‌కు పరుపు డెలివరీ చేయడానికి వెళ్లిన ఇలియాస్‌పై పట్టీతో కట్టని లాబ్రడార్ కుక్క మొరగడం ప్రారంభించింది. భయంతో అపార్ట్ మెంట్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. బిల్డింగ్ సైడ్‌వాల్‌పై పడిపోవడంతో అతనికి అనేక గాయాలయ్యాయి.
అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి ప్రమాదకరంగా లేదని చెప్పారు. రాయదుర్గం పోలీసులు డెలివరీ బాయ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఫ్లాట్ యజమాని డెలివరీ బాయ్‌ని రక్షించేందుకు ప్రయత్నించగా మూడో అంతస్తు నుంచి జారిపడ్డాడని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వారు తెలిపారు. ఆమె వెంటనే గట్టిగా కేకలు వేసింది. కానీ అతనిని పడిపోకుండా కాపాడలేకపోయింది. కుక్క యజమానిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 289 (జంతువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన మొదటి సంఘటనను గుర్తు చేస్తుంది. బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పెంపుడు కుక్క దాడి చేయడంతో 23 ఏళ్ల స్విగ్గీ డెలివరీ రిజ్వాన్ మరణించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను తలుపు తట్టినప్పుడు జర్మన్ షెపర్డ్ కుక్క అతనిపై దాడి చేసింది. రిజ్వాన్ అపార్ట్మెంట్ మూడవ అంతస్తు నుండి దూకాడు.