హైదరాబాద్: మహావీర్ జయంతిని పురస్కరించుకుని మార్చి 31న (మంగళవారం) హైదరాబాద్ నగరవ్యాప్తంగా మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మార్చి 23న అధికారిక సర్క్యులర్ జారీ చేశారు. నగర పరిధిలోని పశువులు, గొర్రెలు, మేకల వధశాలలతో పాటు అన్ని రకాల రిటైల్ మాంసం మరియు బీఫ్ దుకాణాలు ఆ రోజంతా మూసి ఉంచాలని స్పష్టం చేశారు.
జైన మత తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని జన్మదినోత్సవం సందర్భంగా అహింసను పాటించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పరిధిలోని అన్ని విభాగాల్లో ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. గతంలో కూడా స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి వంటి ప్రత్యేక సందర్భాల్లో జీహెచ్‌ఎంసీ ఇటువంటి ఆంక్షలను అమలు చేసిన సంగతి తెలిసిందే.