భోలక్‌పూర్ కార్పొరేటర్‌పై కేసు న‌మోదు

AIMIM Bholakpur Corporator booked for abusing police.పోలీసులపై అభ్యంతరకర పదజాలం వాడినందుకు ఆల్ ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2022 7:33 AM GMT
భోలక్‌పూర్ కార్పొరేటర్‌పై కేసు న‌మోదు

హైదరాబాద్ : పోలీసులపై అభ్యంతరకర పదజాలం వాడినందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ మహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 353 (ప్రభుత్వ సేవకుడిగా ఉన్న ఏ వ్యక్తిపైనైనా దాడులు చేయడం లేదా క్రిమినల్ బలవంతం చేయడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున 2:15 గంటల ప్రాంతంలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లోని నైట్ పెట్రోలింగ్ బృందాలు భోలక్‌పూర్ ప్రాంతంలోని కొన్ని దుకాణాలు తెరిచి ఉన్న‌ట్లుగా గ‌మ‌నించారు. వాటిని మూసివేయాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే.. కొంద‌రు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్ర‌మంలో అక్క‌డికి వ‌చ్చిన ఎంఐఎం కార్పొరేట‌ర్ గౌసుద్దీన్ పోలీసుల‌పై దుర్భాష‌లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

రంజాన్ మాసంలో తెల్ల‌వార్లు దుకాణాలు తెరిచే ఉంటాయి. దుకాణదారుల‌ను ఇబ్బంది పెట్టొద్దు. పోలీసులు త‌మాషాలు చేస్తున్నారు. త‌మ డ్యూటీ తాము చేసుకోని వెళ్లిపోవాలి అని కార్పొరేట‌ర్ అన‌డం ఆ వీడియోలో ఉంది. డ్యూటీనే చేస్తున్నామ‌ని ఓ కానిస్టేబుల్ అన‌గా.. రూ.100 వ్య‌క్తివి నువ్వు.. నాకు స‌మాధానం చెబుతావా మీ ఎస్సైని పిలువు. కార్పొరేట‌ర్ వ‌చ్చాడ‌ని చెప్పు అంటూ దురుసుగా మాట్లాడడం ఆ వీడియోలో విన‌వ‌చ్చు.

ఈ వీడియోను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఓ నెటీజ‌న్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. విష‌యాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. విధి నిర్వహణలో పోలీసు అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌వ‌ద్ద‌ని, రాజ‌కీయాల‌కు అతీతంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

కాగా.. కార్పొరేటర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. కానిస్టేబుళ్లు అనుచితమైన పదజాలంతో మాట్లాడటంతో తాను నిశ్చేష్టుడయ్యానని ఆరోపించారు.

Next Story
Share it