హైదరాబాద్‌లో కెమికల్స్‌తో స్వీట్ల తయారీ..రెండు కేంద్రాలపై పోలీసుల మెరుపుదాడి (video)

హైదరాబాద్ నగరంలో అపరిశుభ్రమైన వాతావరణంలో, హానికరమైన రసాయనాలతో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

By -  Knakam Karthik
Published on : 16 March 2026 9:32 PM IST

Hyderabad News, Food Adulteration, Mylardevpally, AdulteratedSweets

హైదరాబాద్‌లో కెమికల్స్‌తో స్వీట్ల తయారీ..రెండు కేంద్రాలపై పోలీసుల మెరుపుదాడి (video)

హైదరాబాద్ నగరంలో అపరిశుభ్రమైన వాతావరణంలో, హానికరమైన రసాయనాలతో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం సుభాన్ కాలనీ, లక్ష్మీగూడలోని తయారీ యూనిట్లపై దాడులు చేసిన పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో లక్కీ ఫుడ్స్ యజమాని అబ్దుల్ హక్ (54), జీ ఫుడ్స్ యజమాని మహమ్మద్ ఖమెరుద్దీన్ (70) ఉన్నారు. వీరు గడువు ముగిసిన వనిల్లా పౌడర్, సోడియం బెంజోడియం, కృత్రిమ రంగులను ఉపయోగించి మోతీచూర్ లడ్డూలు వంటి స్వీట్లను తయారు చేసి నగరంలోని పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దాడుల్లో సుమారు రూ.1.10 లక్షల విలువైన 98 లడ్డూ బాక్సులు, 35 కిలోల లడ్డూ మిశ్రమం, రసాయనాలు మరియు ఇతర కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తక్కువ ధరకు చెడిపోయిన ముడి పదార్థాలను కొనుగోలు చేసి, వాటికి రంగులు అద్ది వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ తయారీపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Next Story