హైదరాబాద్: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు కీలక ముగింపు లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 24 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగగా, చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే ఇది ఆత్మహత్య కాదు, పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యేనని ప్రత్యూష తల్లి సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలో ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ కావడంతో ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌కు ఐదేళ్ల శిక్ష విధించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రెండేళ్లకు తగ్గించారు. ఆ తర్వాత సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పునే సమర్థించి, వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి, కోర్టు ఆదేశాలతో తిరిగి స్వదేశానికి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.