హైదరాబాద్: టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసభ్యకర ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. లావణ్య తన ఫిర్యాదులో “Purple Crayon00” అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఖాతా ద్వారా తనపై మరియు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెడుతున్నారని వివరించారు.
తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ వేధింపుల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 67తో పాటు, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేశారు. ఆ వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.