జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికి.. ఇప్పటి వరకు పలు డివిజన్లలో 10శాతం కంటే తక్కువగానే ఓటింగ్ నమోదైంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్ పాటిస్తూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలు చోట్ల టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే.. కూకట్‌పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లిలోని ఫోరం మాల్ దగ్గర బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణ నెలకొంది. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ శ్రేణలు గొడవకు దిగాయి. దీంతో కూకట్‌పల్లిలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కారును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తోపులాట చోటుచేసుకుంది. కారు అద్దాలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అయితే.. ఈ గొడవ జరిగిన సమయంలో కారులో మంత్రి పువ్వాడ అజయ్ లేనట్టుగా సమాచారం అందుతోంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.