హెచ్‌సీఏ పరిధిలోని 57 క్రికెట్ క్లబ్లులపై వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పరిధిలోని 57 క్రికెట్ క్లబ్లులపై వేటు పడింది. పాతబస్తీలో ఉన్న సీసీ క్లబ్ పై ఓ యువ క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By అంజి Published on 3 Aug 2023 1:38 AM GMTహెచ్‌సీఏ పరిధిలోని 57 క్రికెట్ క్లబ్లులపై వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పరిధిలోని 57 క్రికెట్ క్లబ్లులపై వేటు పడింది. మొన్న పాతబస్తీలో ఉన్న సీసీ క్లబ్ పై ఓ యువ క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కళ్యాణ్ అనే యువ క్రికెటర్ చార్మినార్ సీసీ క్రికెట్ క్లబ్ యజమాని, అతని కుమారుడు వన్ డౌన్ లో ఆడించేందుకు లక్ష రూపాయలు తీసుకున్నారు. ఈ విధంగా డబ్బులు తీసుకుని క్లబ్ యజమాని, అతని కుమారుడు మోసాలకు పాల్పడుతున్నారని టాలెంట్ ఉన్న క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఈ యువ క్రికెటర్ కళ్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్త వెలుగులోకి రావడంతో కమిటీ అధికారులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు.
ఈ క్రమంలోనే పలు అక్రమాలకు పాల్పడుతున్న మొత్తం 57 క్రికెట్ క్లబ్ లపై వేటు వేశారు. 12 మంది వ్యక్తులు 80 క్లబ్బులను తమ ఆధీనంలో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా కమిటీ గుర్తించింది. ఈ 12 మంది వారి కుటుంబ సభ్యులు హెచ్‌సీఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయా క్లబ్బులు, ఎగ్జిక్యూటివ్ కమిటీల పై నిషేధం విధించారు. జీహెచ్ఎంసీకి చెందిన 21 క్లబ్బులు ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్లినట్లుగా కమిటీ గుర్తించింది. ఏక కమిటీ సభ్యుడు, జస్టిస్ లావు నాగేశ్వరరావు హెచ్‌సీఏలో ప్రక్షాళన మొదలుపెట్టారు.
ఈ క్రికెట్ క్లబ్బులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతుండటంతో.. రంగంలోకి దిగిన కమిటీ ఆడిందే ఆటగా సాగుతున్న క్రికెట్ క్లబ్స్ కి చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే కమిటీ క్లబ్బుల అరాచకాలు, అవినీతి చిట్టా బయటికి లాగుతున్నారు. వచ్చేనెల జరగనున్న ఎన్నికల్లో పాల్గొనకుండా, కనీసం ఓటు హక్కు కూడా వినియోగించకుండా నిషేధం విధించారు. నిషేధానికి గురైన వారిలో శేష్ నారాయణ, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, ప్రకాష్ చంద్ జైన్, అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, విక్రమ్ మాన్ సింగ్, స్వరూప్, విజయానంద్, జాన్ మనోజ్ సహా కీలక వ్యక్తులు ఉన్నట్లుగా సమాచారం.