Hyderabad: నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు

రామంతాపూర్ వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By అంజి  Published on  27 Nov 2024 7:30 AM GMT
fire accidents, Hyderabad city, fire

Hyderabad: నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్‌: రామంతాపూర్ వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నివేదికల ప్రకారం.. బ్యాటరీ బైక్ పేలి ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. భారీ మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లో పార్క్ చేసిన మరో ఏడు ద్విచక్ర వాహనాలు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అటు ఈఐపీఎల్ అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిదో అంతస్తులోని ఓ ప్లాట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లాట్ యజమాని సంతోష్.. గత రెండు రోజుల క్రితమే గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన తర్వాత దేవుడి గదిలో దీపం పెట్టి కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున దీపం ఎదురుగా ఉన్న కలశంకు మంటలు అంటుకున్నాయి. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై దేవుడి గదికి అనుకొని కిచెన్ ఉండడంతో గ్యాస్‌ను ఆఫ్ చేసి కిందికి దిగిపోయారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ పూర్తిగా కాలిపోయింది. హాలు, రెండు బెడ్ రూమ్ లు, కిచెన్, దేవుడి గది మొత్తం ఖాళీ బూడిద య్యాయి. గృహప్రవేశం చేసిన రెండు రోజులకే అగ్నిప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

ఇదిలా ఉంటే.. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే SSV ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రాత్రి దాదాపు 1 గంటల ప్రాంతంలో మూడంతస్తుల భవనం 75 శాతం దగ్దం అయింది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండటంతో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటి నుండి మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. భారీ మంటల దాటికి మొత్తం 4 అంతస్తులు కూలిపోయాయి.

Next Story