'అతడు ఫుడ్‌ డెలివరీ చేయొద్దు'.. స్విగ్గీకి కస్టమర్‌ మెసేజ్

A message sent by a Swiggy customer while ordering food has led to controversy. ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్విగ్గీకి ఓ కస్టమర్ చేసిన మెసేజ్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది 'ఆహారానికి మతం ఉందా?'

By అంజి  Published on  1 Sept 2022 7:52 PM IST
అతడు ఫుడ్‌ డెలివరీ చేయొద్దు.. స్విగ్గీకి కస్టమర్‌ మెసేజ్

ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్విగ్గీకి ఓ కస్టమర్ చేసిన మెసేజ్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన 'ఆహారానికి మతం ఉందా?' అనే వివాదానికి దారితీసింది. హైదరాబాద్‌కు చెందిన స్విగ్గీ కస్టమర్ తన ఫుడ్‌ ఆర్డర్‌ను ముస్లిం డెలివరీ బాయ్ డెలివరీ చేయకూడదని పేర్కొన్నాడు. ఈ సంఘటన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర టాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ కస్టమర్ పేర్కొన్న సూచనల స్క్రీన్‌ను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఇలాంటి అభ్యర్థనకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలని స్విగ్గీని ఆయన అభ్యర్థించారు.

''ప్రియమైన స్విగ్గీ, దయచేసి ఇలాంటి మూర్ఖపు అభ్యర్థనకు వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకోండి. మేము (డెలివరీ వర్కర్లు) హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అనే వారందరికీ ఆహారాన్ని పంపిణీ చేయడానికి ఇక్కడ ఉన్నాము. మజబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖ్నా'' అని షేక్ సలావుద్దీన్ ట్వీట్ చేశాడు. అయితే ఈ వైరల్‌ ట్వీట్‌పై స్విగ్గీ ఇంకా స్పందించలేదు. కాగా స్వీగ్గి కస్టమర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆహారానికి, మతానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ''మీరు వెంటనే ఆ కస్టమర్‌ని బ్లాక్ చేయవచ్చు. ఈ అంశంపై పెద్దగా చర్చలు అవసరం లేదు. కొంతమంది సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులను మనం మార్చలేము, కాబట్టి అలాంటి వాటి గురించి చర్చించడం సమయం వృథా'' అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇదిలా ఉంటే.. మరో సంఘటనలో.. నగరంలోని ఒక స్విగ్గీ కస్టమర్‌ ముస్లిం డెలివరీ బాయ్ తన కోసం తెచ్చిన ఆహారాన్ని తిరస్కరించాడు. దీనికి సంబంధించి డెలివరీ సూచనలలో తాను వ్రాసినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. '' ఫుడ్‌ చాలా తక్కువ కారంగా ఉండాలి. అలాగే దయచేసి హిందూ డెలివరీ వ్యక్తిని ఎంచుకోండి. దీని ఆధారంగానే రేటింగ్‌ ఉంటుంది.'' అని పేర్కొన్నాడు.

Next Story