Hyderabad: చైతన్యపురి వద్ద నడిరోడ్డుపై భారీ గుంత
ఎల్బీనగర్ నుండి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది.
By Srikanth Gundamalla
Hyderabad: చైతన్యపురి వద్ద నడిరోడ్డుపై భారీ గుంత
హైదరాబాద్‌లో వర్షాలు పడితే రోడ్లన్నీ జలమయం అవుతాయి. రోడ్లపై వెళ్లడానికే వాహనదారులు భయపడే పరిస్థితులు ఉంటాయి. నీరు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయి. ఎక్కడ ఏం గుంత ఉంటుందో తెలియక ప్రమాదాలకు గురైన వారూ ఉన్నారు. కానీ.. ఎలాంటి వర్షం లేకపోయినా కూడా భాగ్యనగరంలో నడిరోడ్డుపై భారీ గుంత పడింది. దాంతో.. వాహనదారులు భయాందోళకనకు గురయ్యారు.
చైతన్యపురి జంక్షన్ వద్ద రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఎల్బీనగర్ నుండి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్న సమయంలోనే రెండు అడుగుల వెడల్పుతో నాలుగు అడుగుల లోతు గుంత ఒక్కసారిగా ఏర్పడింది. అయితే..అది వాహనదారులు వెంటనే గమనించి అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. ఎవరూ ఆ గుంతలో పడిపోకుండా గుంత చుట్టు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారులకు సమాచారాన్ని అందించారు. నడిరోడ్డుపై భారీ గుంత ఏర్పడటం వల్ల ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై కొద్దిదూరంపాటు వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఇక కాసేపటికి ఘటనాస్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది గుంత ఏర్పడటానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి ప్రమాదం జరుగుతుందేమో అని చుట్టుపక్కల పరిశీలించారు. ప్రస్తుతం మరమ్మతు పనులు మొదలుపెట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.