రోగుల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడి అరెస్ట్‌

చదువు సంధ్యలు లేవు అయినా కూడా డాక్టర్ అవతారం ఎత్తి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  11 April 2024 6:30 AM GMT
fake doctor, clinic, Malkajigiri, Hyderabad

రోగుల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడి అరెస్ట్‌

చదువు సంధ్యలు లేవు అయినా కూడా డాక్టర్ అవతారం ఎత్తి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో హెల్త్ కేర్ పోలీ క్లినిక్ పేరుతో భోగ పాండు అనే వ్యక్తి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే గతంలో ఇతను ఒక డాక్టర్ వద్ద కాంపౌండర్ గా పనిచేసేవాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడిన భోగ పాండు కాంపౌండర్ ఉద్యోగం మానేసి స్థానికంగా మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఒక షట్టర్ అద్దెకు తీసుకుని పేరు మోసిన ఒక డాక్టర్‌తో క్లినిక్ నడిపించేవాడు. పేరు ప్రఖ్యాతలు ఉన్న డాక్టర్ కావడంతో క్లినిక్ బాగా నడిచేది.

దీంతో పాండు బాగా సంపాదించాడు. అయితే గత సంవత్సరం సదరు డాక్టర్ మరణించడంతో.. వ్యాపారం మూతపడుతుందని భావించిన భోగ పాండు స్వయంగా నకిలీ డాక్టర్ అవతారం ఎత్తి యథేచ్ఛగా క్లినిక్ నడుపుతున్నాడు. తెలిసి తెలియని మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నాడు. విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే మల్కాజిగిరి పోలీసులు రంగంలోకి దిగి నకిలీ డాక్టర్ అవతారం ఎత్తిన పాండును అదుపులోకి తీసుకున్నారు. అసలు పాండు వద్ద ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్ లేదని పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే ఆర్టీసీ కాలనీలోని హెల్త్ కేర్ పోలీ క్లినిక్ ను సీజ్ చేసి.. నకిలీ డాక్టర్ పాండును అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Next Story