హైదరాబాద్‌లో చిన్నారులపై వీధి కుక్కల దాడి ఆగడం లేదు. తాజాగా ఖైరతాబాద్ పెద్ద గణేష్ వెనుక భాగంలో శ్రీనివాస్ నగర్‌లో ఓ కుక్క రోడ్డుపై ఉన్న చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసింది. చిన్నారిపై కుక్క దాడిని అటుగా వెళ్తున్న ఓ బైకర్ గమనించి వెళ్లగొట్టాడు. కాగా ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీ కమెరాలో రికార్డయ్యాయి.
మరో వైపు దాడి తర్వాత చిన్నారి అరుపులు విని స్థానికులు బయటికి వచ్చారు. కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని శార్విగా గుర్తించారు. ఆ చిన్నారి యూకేజీ చదువుతోంది.