ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌: హైదరాబాద్‌ చేరుకున్న 8 రేసింగ్‌ కార్లు

8 racing cars reached Hyderabad for the Formula-E Championship. హైదరాబాద్ : ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ రేస్‌ కార్లు నగరానికి వచ్చేశాయి.

By అంజి  Published on  2 Feb 2023 6:47 PM IST
ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌: హైదరాబాద్‌ చేరుకున్న 8 రేసింగ్‌ కార్లు

హైదరాబాద్ : ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ రేస్‌ కార్లు నగరానికి వచ్చేశాయి. దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ నగరం కూడా సిద్ధమైంది. ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌లో జీఎంఆర్‌ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) బృందం కీలక పాత్ర పోషించింది. ఈరోజు విమానాశ్రయంలోని కార్గో విభాగం దాదాపు 90 టన్నుల రేస్ కార్ భాగాలను, ఎనిమిది అద్భుతమైన రేసింగ్ కార్లను అన్‌లోడ్‌ చేశారు. ఆటో విడిభాగాల మొదటి సరుకు రియాద్ నుండి బుధవారం రాత్రి 11:50 గంటలకు బోయింగ్ 747-400 అనే చార్టర్ ఫ్లైట్ ద్వారా కార్గో టెర్మినల్‌కు చేరుకుంది.

నికర సున్నా కార్బన్ ఉద్గారాలతో సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌స్పోర్ట్, ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 11 జట్లు ఒకదానికొకటి పోటీ పడతాయి. నగరంలో ఇంతకు ముందెన్నడూ చూడని ఈ రేస్‌లో అద్భుతమైన మోటో కార్లు ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రత్యేక పార్కింగ్ స్లాట్ల వద్ద పార్క్ చేసిన విమానం నుండి 83 బాక్స్‌ల ఆటో కాంపోనెంట్‌లతో కూడిన కార్గో అన్‌లోడ్ చేయబడింది. ప్రత్యేకంగా రూపొందించిన కార్గో హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించి షిప్‌మెంట్ అన్‌లోడ్ చేశారు. ఆ తర్వాత జీహెచ్‌ఏసీ టెర్మినల్‌లోని ప్రత్యేకమైన హ్యాండ్లింగ్ ప్రాంతానికి తరలించారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటి ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ కోసం ఎండ్-టు-ఎండ్ అతుకులు లేని ఎయిర్ కార్గో మూవ్‌మెంట్‌ను అందించడంలో హైదరాబాద్ విమానాశ్రయం సమగ్ర పాత్ర పోషించడం గర్వంగా ఉందన్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ - కార్‌ రేసింగ్‌ జరుగబోతోంది. ఈ కార్‌ రేసింగ్‌కు 11 గేట్లను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని వివిధ ప్రాంతాల్లో 17 చోట్ల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశామని సీపీ ఆనంద్‌ తెలిపారు. లా అండ్‌ ఆర్డర్‌ పరంగా 300 మందిని ట్రాఫిక్‌ పరంగా 270 మందిని నియమించినట్లు సీపీ తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో ఈ కార్‌ రేసింగ్‌ జరుగుతుందన్నారు. 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

Next Story