హైదరాబాద్‌లో మద్యం తాగి వాహనం నడిపిన 604 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 6,7 తేదీల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో వీరిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారందరిలో 492 మంది ద్విచక్ర వాహనదారులు, 70 మంది ఫోర్ వీలర్స్ వాహనదారులు, భారీ వాహనదారులు, 42 మంది త్రీ వీలర్ వాహనదారులు ఉన్నారు.
కాగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలను ఎంతమాత్రం సహించబోమని, ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది. ప్రయాణికులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని అభ్యర్థించారు" అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రాణాంతక ప్రమాదానికి కారణమైతే, వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు . ఈ సెక్షన్ కింద గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.