నేటి నుంచి హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ బస్సుల పరుగులు

హైదరాబాద్ రోడ్లపై త్వరలో మొత్తం 50 'గ్రీన్ మెట్రో లగ్జరీ' పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

By అంజి  Published on  20 Sept 2023 9:47 AM IST
TSRTC, electric AC buses, Hyderabad

నేటి నుంచి హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ బస్సుల పరుగులు

హైదరాబాద్ రోడ్లపై త్వరలో మొత్తం 50 'గ్రీన్ మెట్రో లగ్జరీ' పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సెప్టెంబర్ 19 మంగళవారం ప్రకటించింది. "ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 25 బస్సులు సెప్టెంబర్ 20, బుధవారం నడవడం ప్రారంభిస్తాయి" అని రవాణా సంస్థ తెలిపింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గచ్చిబౌలి స్టేడియంలో తొలి 25 బస్సులను ప్రారంభించనున్నారు. రెండవ బ్యాచ్ బస్సులు నవంబర్‌లో నడవనున్నాయి. "బస్సులు పర్యావరణ అనుకూలమైనవి, జీరో వాయు కాలుష్యాలను విడుదల చేయడమే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తాయి" అని టిఎస్‌ఆర్‌టిసి తెలిపింది.

35 సీట్ల కెపాసిటీ కలిగిన 'గ్రీన్ మెట్రో లగ్జరీ' బస్సు పూర్తిగా ఛార్జ్ కావడానికి 3-4 గంటల సమయం పడుతుందని, ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరాన్ని ఒకే ఛార్జ్‌లో కవర్ చేయగలదని తెలిపింది. టీఎస్‌ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం.. 12 మీటర్ల పొడవున్న ఈ బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇవి నెల రోజుల బ్యాకప్ సామర్థ్యం కల్గినవి. ప్రయాణీకుల సౌకర్యార్థం ఛార్జింగ్ సాకెట్లు, రీడింగ్ ల్యాంప్‌లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

“ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహన ట్రాకింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ బటన్ కూడా అందుబాటులో ఉంచబడ్డాయి. బస్సును వెనక్కి తిప్పేందుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గమ్యస్థానాన్ని సూచించే LED బోర్డులు, ప్రారంభ స్థానం బస్సు ముందు, వెనుక రెండింటిలోనూ ఏర్పాటు చేయబడ్డాయి. అగ్ని ప్రమాదాలను గుర్తించి నిరోధించడానికి ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (FDSS) కూడా ఏర్పాటు చేయబడింది. ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది’’ అని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

Next Story