నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 'సునామీ బసంత్' కన్నుమూత

సోమవారం అర్థరాత్రి నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సునామీ బసంత్ అనే 20 ఏళ్ల మగ జిరాఫీ మరణించింది

By Medi Samrat  Published on  29 Oct 2024 3:45 PM GMT
నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సునామీ బసంత్ కన్నుమూత

సోమవారం అర్థరాత్రి నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సునామీ బసంత్ అనే 20 ఏళ్ల మగ జిరాఫీ మరణించింది. వృద్ధాప్య సమస్యలతో ఆ జిరాఫీ మరణించినట్లు అధికారులు తెలిపారు. జూ అధికారుల ప్రకారం, బసంత్ 2004 సంవత్సరంలో సునామీ విపత్తు సమయంలో న్యూ ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లో జన్మించాడు. 2009లో జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తీసుకువచ్చారు.

బసంత్ గత రెండు సంవత్సరాల నుండి వెనుక కాళ్ళలో కీళ్ళనొప్పులతో బాధపడుతున్నాడు. జూ డిప్యూటీ డైరెక్టర్ (వెట్), డాక్టర్ M.A.హకీమ్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. VBRI, వెటర్నరీ కళాశాల పశువైద్య నిపుణులతో మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. జూ క్యూరేటర్ డా.సునీల్, ఎస్. హిరేమఠ్, సిబ్బంది ఎన్‌క్లోజర్ వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బసంత్ మరణం తర్వాత, జూలో ప్రస్తుతం సన్నీ అనే ఒకే ఒక మగ జిరాఫీ ఉంది.

Next Story