యువ‌తిపై దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

14 Days Remand in LB Nagar Premonmadi attack case.ఎల్బీ నగర్‌ ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడు బస్వరాజ్‌కి కోర్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2021 8:49 AM GMT
యువ‌తిపై దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

ఎల్బీ నగర్‌ ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడు బస్వరాజ్‌కి కోర్టు రిమాండ్ విధించింది. నిన్న హ‌స్తినాపురంలో ఓ యువ‌తిపై బ‌స్వ‌రాజు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడు బ‌స్వ‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేడు(గురువారం) రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా.. న్యాయ‌స్థానం నిందితుడు బ‌స్వ‌రాజ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. యువ‌తి త‌ల్లిదండ్రులు, సోద‌రుడు యువ‌తి చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి చేరుకున్నారు. వైద్యులను అడిగి.. త‌మ కుమారై ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం యువ‌తి త‌ల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. యువ‌తి ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉన్న‌ట్లు చెప్పారు. యువ‌తి శ‌రీరంపై 18 చోట్ల గాయాలున్నాయ‌ని.. 24గంట‌లు గ‌డిస్తే కానీ ఏమీ చెప్ప‌లేమ‌ని డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు తెలిపారు.

ఏం జ‌రిగిందంటే..?

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండ‌లం చంద్ర‌క‌ల్‌కు చెందిన ఓ యువ‌తి(20)కి అదే ప్రాంతం తిమ్మారెడ్డిప‌ల్లికి చెందిన బ‌స్వ‌రాజ్‌(23)తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. వీరిద్ద‌రి పెళ్లికి యువ‌తి త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌లేదు. మూడు నెల‌ల క్రితం యువ‌తికి మ‌రో వ్య‌క్తితో నిశ్చితార్థం జ‌రిగింది. నిశ్చితార్థం అనంత‌రం యువ‌తిని హ‌స్తినాపురంలోని బాబాయి ఇంట్లో ఉంచారు. స‌న్‌సిటీ స‌మీపంలోని రామ్‌దేవ్‌గూడ‌లో ఉంటూ సెంట్రింగ్ ప‌ని చేస్తున్న బ‌స్వ‌రాజ్ ప‌థ‌కం ప్ర‌కారం బుధవారం సాయంత్రం 4.30గంట‌ల‌కు హ‌స్తినాపురంలో ఉంటున్న యువ‌తి వ‌ద్ద‌కు వ‌చ్చాడు.

యువ‌తి ఇంట్లో ఒంటరిగా ఉన్న విష‌యాన్ని నిర్థారించుకున్నాడు. ఒక్క‌సారి మాట్ల‌డితే వెళ్లిపోతానంటూ మెసేజ్ పెట్టాడు. యువ‌తి బ‌య‌ట‌కు రాగానే పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చాడు. మ‌రో వ్య‌క్తితో నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నావ‌ని ఆగ్ర‌హాంతో ఊగిపోయాడు. పెళ్లిని ఆపేస్తానంటూ.. క‌త్తితో రాక్ష‌సంగా దాడి చేసి ప‌రార‌య్యాడు. స్థానికులు యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story