క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా 20వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. నాలుగున్న‌ర ల‌క్ష‌ల‌మందికి పైగా ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భార‌త్‌లో కూడా 600కు పై క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం 21 రోజులు పాటు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

దేశ వ్యాప్త లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇళ్లల్లోంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో చ‌దువుకుంటున్న‌, ఉద్యోగాలు చేస్తున్న యువ‌త క‌ష్టాలు వర్ణనాతీతం. ఇప్ప‌టికే కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌లు అన్ని మూత ప‌డ్డాయి. ఇళ్ల‌కు వెళ‌దామ‌నుకున్న‌ బ‌స్సులు, రైళ్లు న‌డవ‌డం లేదు. దీంతో ఏం చేయాలో పాలు పోని స్థితిలో ఉన్నారు. వీరంద‌రు బ్ర‌తుకు తెరువు కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన వారే కావ‌డంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న వీళ్ల త‌ల్లిదండ్రులు త‌మ కొడుకులు, కుమార్తెలు ఎలా ఉన్నారో అని ఆందోళ‌న ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఓ యువ‌కుడు అమ్మ కోసం హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ సైకిల్ పై బ‌య‌లు దేరాడు.

వివరాల్లోకి వెళితే.. విజ‌య‌వాడ‌కు శ్రీను(24) హైద‌రాబాద్‌లోని లింగంప‌ల్లిలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ సంస్థ‌లో సూప‌ర్ వైజ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో కంపెనీ న‌డ‌వ‌డం లేదు. ర‌వాణా స‌దుపాయం లేక‌పోవ‌డంతో శ్రీను సైకిల్ పై హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ బ‌య‌లు దేరాడు. లింగంప‌ల్లి నుంచి సైకిల్ పై బ‌య‌లు దేరిన శ్రీను కూక‌ట్ ప‌ల్లి మీదుగా వెలుతున్నాడు.

గ‌మ‌నించి అత‌న్ని ఆపి ఎక్క‌డికి వెలుతున్నావ్ అని అడ‌గ‌గా.. ‘అన్నా మాది విజ‌య‌వాడ‌.. లింగంప‌ల్లిలో ప‌ని చేస్తున్నా.. బైకులు ఎవరూ ఇవ్వ‌లేదు. ఎవ్వ‌రిని ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక సైకిల్‌ను తీసుకుని వెలుతున్నా. పోయే వాన్ని కాదుకాని మామ‌మ్మి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఎలా వెళ్లాలో తెలియ‌క.. ఎవ్వ‌రిని ఇబ్బంది పెట్ట‌లేక‌.. సైకిల్ తీసుకుని పోతున్నా.. మ‌ధ్య‌లో ఆయాసం వ‌చ్చిన‌ప్పుడు ఓ చోట ఆగుతున్న‌.. రాత్రినే బ‌య‌లు దేరా.. అయితే పోలీస్ వాళ్లు.. ఆపారు. రాత్రి 12 త‌రువాత ప్ర‌యాణించ‌డం మంచిది కాదు అన్నారు. దీంతో పొద్దున్నే బ‌య‌లు దేరా.. ప్ర‌స్తుతానికి గంట‌కు 15 కిలో మీట్ల‌ర్లు ప్ర‌యాణిస్తున్నా.. రాత్రి క‌ల్లా జ‌గ్గ‌య్య‌పేట‌కు వెళ్తా.. మా చెల్లి వాళ్లు ఉన్నారు. రాత్రి అక్క‌డే ఉండి పొద్దునే విజ‌య‌వాడ పోతా.’ అని చెప్పాడు.

అడుగ‌డునా ఆంక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో అత‌ను విజ‌య‌వాడ వెళ్ల‌గ‌ల‌డా..? తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి ప్ర‌స్తుతం ఎవ్వ‌రిని అనుమ‌తించ‌ని నేప‌థ్యంలో అత‌ను విజ‌య‌వాడ చేరుకోగ‌ల‌డా..? ఇవేమి ఆలోచించ‌కుండా చేసింది అత‌నికి త‌ల్లి పై ఉన్న‌ప్రేమ‌. దూరాన్ని సైతం లెక్క చేయ‌కుండా సైకిల్ పై బ‌య‌లుదేరిన అత‌డు త‌న త‌ల్లిని చేరుకోవాల‌ని కోరుకుందాం..

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.