పాదచారులకు తప్పనున్న తిప్పలు.. పట్టాలెక్కిన ఎఫ్‌ఓబీ నిర్మాణాల ప్రాజెక్ట్‌..!

By అంజి  Published on  1 Dec 2019 7:50 AM GMT
పాదచారులకు తప్పనున్న తిప్పలు..  పట్టాలెక్కిన ఎఫ్‌ఓబీ నిర్మాణాల ప్రాజెక్ట్‌..!

ముఖ్యాంశాలు

  • రూ.232.08 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు రూపకల్పన
  • 8 స్కైవేలు, 52 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలకు జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు
  • పనులు మొదలు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: నగర పాదాచారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా నిధుల కొరత కారణంగా మూలన పడ్డ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణ ప్రాజెక్ట్‌ తాజాగా పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్ట్‌ నాలుగు ప్యాకేజీలుగా రూపుదిద్దుకున్నది. దీనికి సంబంధించిన టెండర్లు పూర్తికాగా.. వెంటనే ప్యాకేజీ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ జోన్లకు సంబంధించిన ప్యాకేజీలో నాలుగు స్కైవేలు, 16 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ఉన్నాయి. త్వరలోనే అన్ని ప్యాకేజీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.232.08 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కాగా ప్రాజెక్టు నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు.

కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు, జంక్షన్లలో స్కైవేలు నిర్మించేందుకు బల్దియా అధికారులు నడుం బిగించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంస్థలు నిధుల కొరత కారణంగా కొత్త ప్రాజెక్టు నిర్మాణాలపై పెద్ద ఆసక్తి చూపించలేదు. తాజాగా ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 8 స్కైవేలు, 52 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. వెంటనే మూడో ప్యాకేజీ పనులు మొదలు పెట్టాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జంక్షన్లలో పాదాచారులు ఎటువైపు నుంచి ఎటువైపుకైనా వెళ్లే విధంగా స్కైవేలను నిర్మించనున్నారు. నగరంలోని జంక్షన్ల వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను, స్కైవేలను ఉక్కుతో నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ఉక్కుతో నిర్మించచడం ద్వారా సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.

లంఘర్‌హౌస్‌లో ఆరెమైసమ్మ దేవాలయం (ఎస్కలేటర్‌తో), షేక్‌పేటలోని ఒయాసిస్‌ పాఠశాల (ఎస్కలేటర్‌తో), బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1లోని జీవీకే వన్‌, షేక్‌పేట పాస్ట్‌ పోర్టు కార్యాలయం, కోఠి మహిళా కాలేజీ, మైత్రివనంలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం, అశోక్‌నగర్‌ క్రాస్‌ రో్డు, పంజాగుట్ట సెంట్రల్‌ (ఎస్కలేటర్‌తో), దోమలగూడ ఇందిరాపార్క్‌, మెహదీపట్నం, నారాయణగూడపై వంతెన- హిమాయత్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు మధ్య, గాంధీ ఆస్పత్రి, నేరెడ్‌మెట్‌ బస్టాపు, తార్కాక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల, సికింద్రబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల(ఎస్కలేటర్‌తో), రైల్ నిలయం వద్ద ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. లక్డీకాపూల్‌, బంజారాహిల్స్‌ రోడ్డు నెం.12, చిలకలగూడ రింగ్‌ రోడ్డు, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులలో నాలుగు స్కైవేలను రూ.27.1 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.

Next Story