మూసీలో క్రిములు 'మందుకు' అలవాటు పడిపోయాయ్..!!

By అంజి  Published on  2 Dec 2019 11:28 AM IST
మూసీలో క్రిములు మందుకు అలవాటు పడిపోయాయ్..!!

మూసీ ఒక మురికి కూపం. ఊరూరి మలిన జలాలన్నీ మూసీలో కలిసి, అత్యంత భయంకర బాక్టీరియాలకు అది నిలయమైపోయింది. అయితే ఈ బాక్టీరియా యాంటీ బయాటిక్స్ కి లొంగడం లేదు. యాంటీ బయాటిక్స్ ను కూడా అవి హాయిగా భోంచేసేస్తున్నాయి. ఎందుకంటే వివిధ కర్మాగారాలు విడుదల చేసే యాంటీ బయాటిక్స్ మేసి మేసి ఇప్పుడవి రుచి మరిగిపోయాయట. యాంటీ బయాటిక్స్ ను తట్టకునే శక్తి వాటికి వచ్చేసిందట. ఇప్పుడు మూసీలోని బాక్టీరియా పోలీసుకు భయపడని దొంగలా బరితెగిస్తున్నాయట.

వ్యాధులను దోమలు విచ్చలవిడిగా పంచేస్తున్నాయట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ తన అధికారిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మందులకు లొంగని మూసీ బ్యాక్టీరియా వల్ల పరిస్థితి నానాటికీ దిగజారబోతోందని స్పష్టంగా ప్రకటించింది. ఈ కమిటీ లో హైదరాబాద్ బిట్స్ పిలాసీ కి చెందిన నిపుణులు, కేంద్ర కాలుష్య నివారణ బోర్డు, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డుల అధికారులు ఉన్నారు. నివేదిక ప్రకారం మూసీలోని 54 చోట్ల నుంచి సేకరించిన నీటి సాంపిల్స్ లో ఉన్న 90 రకాల బాక్టీరియాల్లో పధ్నాలుగు రకాల యాంటిబయాటిక్స్ ను తట్టుకునే శక్తి ఉందట. కొన్ని బాక్టీరియాలు నాలుగైదు రకాల యాంటిబయాటిక్స్ ను తట్టుకోగలిగితే కొన్ని పదమూడు రకాల బాక్టీరియాలను తట్టుకుంటున్నాయట. కార్పబెనిమ్ వంటి అత్యంత ప్రభావవంతమైన యాంటీ బయాటిక్ ను కూడా ఈ బాక్టీరియాలు తట్టుకోగలుగుతున్నాయట. మూసీలో ప్రధానంగా ఈ కోలి, క్లెబ్సియెల్లా, సూడో మోనాస్, స్టాఫిలో కాకస్, ఎంటరో కాకస్ వంటి ప్రమాదకర బాక్టీరియాలు ఉన్నాయి. ఇవన్నీ మనుషుల్లో వివిధ వ్యాధులను వ్యాపింప చేస్తాయి.

పదేపదే యాంటీ బయాటిక్స్ ను ఎదుర్కొని, క్రమేపీ వాటిని తట్టుకునే శక్తిని పొందిన ఈ బాక్టీరియా మానవ శరీరంలోకి చేరి, రోగాలు పుట్టిస్తే వాటిని అరికట్టడం అసాధ్యమౌతుంది. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చే యాంటీ బయాటిక్స్ వీటిపై పనిచేయవు. ఇలాంటి బాక్టీరియాలను సూపర్ బగ్ లు అంటారు. ఇలాంటి సూపర్ బగ్ ల బారిన పడి ఏటా ఏడు లక్షల మంది చనిపోతున్నారని అంచనా.

Next Story