దేవికారాణి అక్రమార్జనలు.. హవాలా వ్యాపారానికి ఏ మాత్రం తీసిపోదు..!

By అంజి  Published on  3 Dec 2019 8:18 AM GMT
దేవికారాణి అక్రమార్జనలు.. హవాలా వ్యాపారానికి ఏ మాత్రం తీసిపోదు..!

ముఖ్యాంశాలు

  • దేవికారాణి అవినీతిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు
  • రూ.7.50 కోట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తింపు
  • దేవికారాణి నిగ్గు తేల్చే పనిలో ఏసీబీ అధికారులు

హైదరాబాద్: ఐఎంఎస్‌ మందుల కొనుగోళ్ల స్కామ్‌లో డైరెక్టర్‌ దేవికారాణి అవినీతి, ఆక్రమ ఆస్తులు బట్టబయలు అవుతున్నాయి. దేవికారాణి అక్రమార్జనలో మరో కొత్త కోణం బయటపడింది. దేవికారాణి 3 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లుగా ప్రాథమిక విచారణలో ఏసీబీ అధికారులు గుర్తించారు. కాగా ఇప్పుడు వాటి విలువ రూ.3 కోట్లు కాదని, రూ.7.50 కోట్లని ఏసీబీ అధికారులు తాజాగా నిర్ధారించారు. ఒక్కో ఆభరణం విలువ రూ.45 లక్షలని.. ఈ ఆభరణాలన్నింటినీ పీఎంజే జ్యుయలరీ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. జ్యుయలరీ సంస్థ నుంచి దర్యాప్తు ప్రారంభించి ఏసీబీ అసలు విషయాన్ని గుర్తించింది.

మెడికల్‌ ఏజెన్సీల నుంచి వచ్చిన డబ్బుతో దేవికా రాణి పెద్ద మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ తెలిపింది. దేవికారాణి అక్రమార్జనలు.. హవాలా వ్యాపారానికి ఏ మాత్రం తీసిపోదు. డబ్బును ఎవరి వద్ద తీసుకోవాలనే విషయాన్ని దేవికారాణి ఆభరణాల షోరూమ్‌ యాజమానికి మెసేజ్‌ ద్వారా తెలియజేసేదని అధికారులు గుర్తించారు. జ్యుయలరీ షాపు యాజమాని బంగారం ఆభరణాలను డెలివరీ బాయ్‌కి ఇచ్చి పంపించి డబ్బులు తీసుకునేవవాడని.. అయితే ఎప్పటికప్పుడు దేవికారాణి, షాపు యాజమాని సెల్‌ఫోన్‌లో చాట్‌ చేసిన మెసేజ్‌లను డిలీట్‌ చేశారు. డెలివరీ బాయ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. కీలక సమాచారాన్ని రాబాట్టారు.

పీఎంజే జ్యుయలరీ సంస్థలో దేవికారాణి కొనుగోళ్లకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. దేవికారాణి బ్యాంక్‌ లాకర్‌లను ఓపెన్‌ చేసి చూశారు. కాగా లాకర్లలో ఆభరణాలు లభించలేదు. రూ.7.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దేవికారాణి ఎక్కడదాచారనే దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోసారి దేవికారాణి ఇళ్లులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎస్‌లో అక్రమ మందుల కొనుగోళ్లకు సంబంధించిన కేసును ఏసీబీకి బదిలీ కాకుండా ఓ ఐఏఎస్‌ అధికారి ప్రయత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దేవికారాణి నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.

Next Story