“ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, సిగరెట్ కాల్చుకోవడానికి బోలెడు నిప్పు దొరికిందని ఇంకొకడు సంబర పడ్డాడట” అన్నది పాత సామెత. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రేప్ జరిగి ఒక కుటుంబం కన్నీరుకారుస్తుంటే సెల్ఫీలకు భలే చోటు దొరికిందన్నది నేటి సామెత.

దిశ అనే వెటర్నరీ డాక్టర్ ను నలుగురు పాశవికులు ఆటవికంగా అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసి, ఆ తరువాత ఆనవాళ్లు లేకుండా పెట్రోలు పోసి తగులబెట్టిన చోటు ఇప్పుడొక సెల్ఫీ టూరిజం స్పాట్ గా మారిపోయింది. కుర్రాళ్లు, పెద్దాళ్లు ఏమిటి … ఎవరు పడితే వారు ఆ చోటకు వెళ్లి సెల్ఫీలు దిగే పనిలో పడ్డారు. పోలీసులు ఎంత తరిమేస్తున్నా ఎవరో ఒకరు ఎలాగో ఒకలాగ ఆ చోటకు చేరుకుని ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఆ చోట జరిగిన భయంకరమైన క్రైమ్ తాలూకు సాక్ష్యాధారాలు కూడా నాశనం చేసేస్తున్నారు. దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారట. కొన్ని కొన్ని సార్లు ఏకంగా భార్యా భర్తా, పిల్లాపాపలతో సహా మొత్తం కుటుంబాలకు కుటుంబాలు దహన స్థలంలో లేక రేప్ జరిగిన స్థలంలో ఫోటోలు దిగుతున్నారు. ఈ సెల్ఫీ పిచ్చివాళ్లను దూరంగా ఉంచే ప్రయత్నంలో పాపం పోలీసులకు కనీసం వాష్ రూమ్ కి వెళ్లే టైమ్ కూడా దొరకడం లేదని చెబుతున్నారు.

రేప్ జరిగిన చోట పొదలు, కలుపు మొక్కలని తొలగించి చదును చేశారు. అక్కడ ఇప్పుడు లారీల పార్కింగ్ జరగకుండా చూస్తున్నారు. రేప్ జరిగిన చోట కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా సెల్ఫీ వీరులు సాయుధులై సదరు “తీర్థయాత్ర” కు వెళ్లొచ్చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.