ఓపెన్‌ నాలాలపై ప్రభుత్వం ఆగ్రహం.. నవీన్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..!

By సుభాష్  Published on  22 Sep 2020 6:03 AM GMT
ఓపెన్‌ నాలాలపై ప్రభుత్వం ఆగ్రహం.. నవీన్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..!

హైదరాబాద్‌లో ఓపెన్‌ నాలాలపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇటీవల బాలిక సుమేధ (12), నవీన్‌ (45) భారీ వర్షాల కారణంగా ఓపెన్‌ నాలాలు మృత్యుకూపాలుగా మారడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఈ రెండు నాలాలు తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఓపెన్‌ నాలాలను మూసివేసే పనిలో పడ్డారు. కాగా, సరూర్‌ నగర్‌ చెరువులో కొట్టుకుపోయిన నవీన్‌ కుమార్‌ మృతదేహానికి ఈ రోజు పోస్టుమార్టం నిర్వహించారు. నవీన్‌కుమార్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు సరూర్‌నగర్‌ చెరువు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, నగరంలో ఓపెన్‌గా ఉన్న నాలాలపై బాక్స్‌ డ్రైనేజీల నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రమాదకరంగా ఉన్న నాలాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు మీటర్ల కన్న తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై బాక్స్‌ డ్రైనేజీల కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. రెండు మీటర్ల కన్నా వెడల్పు ఉన్న నాళాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Next Story