మీరు 40 కి.మీ వేగం దాటండి.. మేం మీ పని పడతాం..!

By అంజి  Published on  20 Jan 2020 10:51 AM GMT
మీరు 40 కి.మీ వేగం దాటండి.. మేం మీ పని పడతాం..!

హైదరాబాద్‌: నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే పలు నిబంధనలు విధించి వాహనదారుల పట్ల కొరడా ఝులిపిస్తున్నారు. కొందరు యువకులు పగలు, రాత్రి అని తేడా లేకుండా ట్రాఫిక్‌ ఉన్న చోట కూడా ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారు. తాజాగా ఫ్లైఓవర్లపై వేగ పరిమితి నిబంధనలను అమలు పర్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టుల విభాగం ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఫ్లైఓవర్ల వద్ద సూచిక బోర్డులు, వాహనాల నియంత్రణ ఏర్పాట్లను మొదలు పెట్టింది.

ఐటీ కారిడార్‌లో మొదలైన ఈ ప్రక్రియ త్వరలో నగర మొత్తం విస్తరిస్తుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లు తెలిపారు. సైబరాబాద్‌ పోలీసుల సహాకారంతో వేగపరిమితి సూచికలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై భారీ ప్రమాదం జరిగింది. కారు అతివేగం వల్ల అదుపు తప్పి ఫ్లైఓవర్‌ మీది నుంచి కిందపడింది. అంతకుముందు కూడా ఇదే ఫ్లైఓవర్‌ మరో ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బైక్‌ను వేగంగా వచ్చి ఓ కారు ఢీకొట్టింది. ఇలా గడిచిన రెండు, మూడు నెలల్లోనే ఫ్లైఓవర్‌లపై ప్రమాదాలు పెరుగుతుండడంతో నగర యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని వివిధ రోడ్లను, జంక్షన్లను రూ.700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఎస్సార్డీపి కింద ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రూ.3 వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.

అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ అండర్‌పాస్‌, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ అండర్‌పాస్‌, ఎల్బీనగర్‌ జంక్షన్‌ ఎడమవైపు ఫ్లైఓవర్‌, రాజీవ్‌గాంధీ జంక్షన్‌పై ఫ్లైఓవర్‌, బైరామల్‌గూడ చెక్‌పోస్టు జంక్షన్‌ అండర్‌పాస్‌, కామినేని జంక్షన్‌ ఎడమవైపు ఫ్లైఓవర్‌ పురగోతిలో ఉన్నాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిపుణులు కమిటీ సభ్యులు రక్షణ చర్యలతో 100 కీ.మీ వేగంతో ఇన్నోవా కారును నడిపి ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషించారు. అనంతరం కమిటీ సభ్యులు సూచించిన మార్గదర్శకాలను అధికారులు అమలు చేశారు. ఫ్లైఓవర్‌పై రకరకాల దంబుల్‌ స్ట్రిప్స్‌, మలుపుల 1.5 మీటర్ల ఎత్తున్న రెయిలింగ్‌ నిర్మించారు. స్పీడు 40 కీ.మీటర్లకు మించవద్దంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు ఏర్పాటు చేశారు. ఏడు సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. జనవరి 4న ఫ్లైఓవర్‌ను తిగిరి ప్రారంభించారు.

రంబుల్‌ స్ట్రిప్స్‌పై వాహనదారుల అభ్యంతరం..

కాగా ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన రంబుల్‌ స్ట్రిప్స్‌ కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని బైక్‌పై వెళ్లేవారు అంటున్నారు. రంబుల్‌ స్ట్రిప్స్‌పై వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్‌సీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కొంత వరకు వేగపరిమితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. అన్ని ఫ్లైఓవర్లపై రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయాలన్న ట్రాఫిక్‌ పోలీసుల సూచనను కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపామని ఇంజినీరింగ్‌ విభాగం తెలిపింది.

మరోవైపు ఇద్దరికి హెల్మెట్‌ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. మన దేశంలో ఇప్పటికే బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో బైక్‌ వెనుక సీటుపై కూర్చునే వారికి హెల్మెట్‌ తప్పనిసరి నిబంధన ఉంది. బైక్‌ వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్‌ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ విధానం అమలులో ఉంది.

Next Story