హైదరాబాద్‌లో వర్షం బీభత్సం: 24 గంటల్లో 30 మంది మృతి..!

By సుభాష్  Published on  15 Oct 2020 12:52 PM IST
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం: 24 గంటల్లో 30 మంది మృతి..!

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ వర్షం కారణంగా భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ వర్షం కారణంగా 24 గంటల్లో 30 మంది వరకు ప్రాణాలు విడిచారు. పల్లె చెరువులో ఆరుగురి మృత దేహాలను అధికారులు గుర్తించగా, మరో 9 మంది గల్లంతయ్యారు. ఎస్‌ఆర్‌నగర్‌లో ఇద్దరు, దిల్‌సుఖ్‌నగర్‌లో మూడేళ్ల చిన్నారి సెల్లర్‌ నీటిలో మునిగి మృతి చెందింది. అలాగే చంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మదీయనగర్‌లో ప్రహరీగోడ కూలి పక్కనే ఉన్న రెండు ఇళ్లపై పడింది. దీంతో ఇళ్లల్లో నిద్రిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన 9 మంది మృతి చెందారు. హయత్‌నగర్‌లో ఇద్దరు మృతి చెందగా, నాగోల్‌లో పోస్టుమెన్‌ వరద నీటిలో కొట్టుకుపోయాడు. అలాగే అంబర్‌పేటలో విద్యుత్‌ షాక్‌తో ఒకరు మృతి చెందగా, బంజారాహిల్స్ లో ఓడాక్టర్‌ కరెంటు షాక్‌తో మృతి చెందాడు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గోడకూలి తల్లి, కూతురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 30 మందికి పైగా చేరింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ నగరం జలదిగ్బంధమైంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. సరూర్‌నగర్‌ చెరువు కట్ట తెగిపోవడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దాదాపు 36 గంటలకుపైగా కాలనీ నీటిలో నానుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లలేక, నిత్యావసరాలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. మూడు రోజులపాటు నగరంలో ఎవ్వరు కూడా బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. నగరంలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Next Story