నరకంలో నగరం.. బస్తీల్లోకి కొండచిలువ.. బిక్కుబిక్కుమంటున్న జనాలు
By సుభాష్ Published on 15 Oct 2020 9:39 AM GMTభాగ్యనగరంలో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. హైదరాబాద్ నగరం నరకం అనుభవిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. వాహనాలు సైతం వదరల్లో కొట్టుకుపోగా, వర్షానికి కూలిపోయిన ఇళ్ల కారణంగా గడిచిన 24 గంటల్లో నగరంలో 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇక వరదల కారణంగా భాగ్యనగరం అల్లాడుతోంది. అడవుల్లో ఉండాల్సిన పాములు, కొండచిలువలు బస్తీలోకి చేరుకుంటున్నాయి. తాజాగా పురానాపూల్ ప్రాంతంలో ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. కొందరు యువకులు ధైర్యంతో దానిని పట్టుకుని సంచిలో వేసి బంధించారు.
వర్షం తగ్గుముఖం పట్టినా జలదిగ్బంధంలో..
నగరంలో ఈ రోజు వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదల్లో వాహనాలు చిక్కుకుపోయాయి. కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. చంద్రయణగుట్టలో ఓ రైస్‌మిల్లు నుంచి పెద్ద ఎత్తున వరదల్లో వరిధాన్యం కొట్టుకువచ్చింది. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో సరూర్ నగర్ చెరువు నిండుకుండలా మారిపోయింది. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వరద నీటిలో ఏర్పడని పరిస్థితి నెలకొంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద నీటిలో చిక్కుకున్నవారిని రక్షిస్తున్నారు. పలు ఇళ్లు నేలమట్టం కావడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షం కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం పొంచివుందో తెలియని పరిస్థితి నెలకొంది
మణికొండ ప్రాంతంలో ఉన్న ఇళ్లు చుట్టూ నీరు చేరింది ప్రమాదకరంగా మారింది. జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పలువురు వరదనీటిలో చిక్కుకుని తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వర్షం ధాటికి పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. రెండు, మూడు రోజుల నుంచి క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నారు.