అత్యాధునిక రవాణా సదుపాయం.. మున్సిపల్ ఎన్నికల తర్వాత టెండర్లు..!
By Newsmeter.Network Published on 12 Jan 2020 9:00 AM GMTహైదరాబాద్ మహానగరంలో ఆకాశ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో కొత్త రవాణా సౌకర్యానికి తెరలేపింది. కెపీహెచ్బీ మెట్రో స్టేషన్ నుంచి ఐటీ కారిడార్ చుట్టూ గచ్చిబౌలి మీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మెట్రో రెండో దశకు అనుసంధానంగా 19 కిలోమీటర్ల మేర ఆకాశ మార్గాన బస్సులు తిరిగేందుకు (ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ సిస్టమ్) ప్రాజెక్ట్ డీపీఆర్ తయారు అయ్యింది. ఈ మార్గంలో కేవలం ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే తిరగనున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే మున్సిపల్ ఎన్నికల అనంతరం.. ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలున్నాయి. ఎన్నికల అనంతరం గ్లోబల్ టెండర్లు పిలవనున్నారు. నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యంగా తీవ్రరూపం దాల్చుతోంది. సగటు హైదరాబాద్ వాసి ప్రతి రోజు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో రాయదుర్గం వరకు మెట్రో రైలు సర్వీసులు ఉన్నా.. గచ్చిబౌలి వరకు సరైన సదుపాయం లేదు.
ఈ నేపథ్యంలోనే ఐటీ కారిడార్ గచ్చిబౌలి నుంచి కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వరకు ఆకాశ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు నగరాల్లో రోడ్లపై ఉండే రోడ్డు మార్గాల్లో బీఆర్టీఎస్ ద్వారా బస్సులను నడపుతారు. ఈ విషయమై ఇప్పటికే వివిధ నగరాల్లో అధికారులు అధ్యయనం చేశారు. బీఆర్టీఎస్ ద్వారా రోడ్లపై బస్సులు నడపడం సాధ్యం కాదని తెలడంతో.. మెట్రో మాదిరిగా ఆకాశ మార్గాలను ఏర్పాటు చేయాలని భావించారు. హైదరాబాద్ రోడ్లపై కూడళ్లు ఎక్కువగా ఉన్నాయి. పీవీ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా ఈ ఆకాశ మార్గాల్లో నిర్మిస్తారు. కేవలం ఎలక్ట్రికల్ బస్సులను మాత్రమే ఈ మార్గంలోకి అనుమతిస్తారు.
దాదాపు కిలోమీటర్‌కు ఒక స్టేషన్ చొప్పున 18 స్టేషన్లు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టడంతో పాటు ప్రాజెక్ట్‌కు రూ.2,800 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట్లో నిత్యం లక్ష మంది, క్రమక్రమంగా 3 లక్షల మంది ప్రయాణికుల వరకు పెరిగే అవకాశం ఉంది. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్, రాజీవ్ సర్కిల్, జెఎన్టీయూ, మలేసియన్ టౌన్షిప్, ఫోరంమాల్, హైటెక్‌సిటీ, హైటెక్స్ న్యాక్, టెక్‌మహీంద్ర, లెమన్‌ట్రీ, ఐకియా, డెలాయిట్, త్రిపుల్ ఐటీ కూడలి, నార్సింగ్ చౌరస్తా, ఎయిర్‌పోర్టు వరకు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.