హైదరాబాద్ కు ఏమైంది? 998 నుంచి ఏకంగా 1658కి జంప్
By సుభాష్ Published on 4 July 2020 6:10 AM GMTఅప్పుడెప్పుడో మార్చిలో ఒక పాజిటివ్ కేసు హైదరాబాద్ లోని మహేంద్రహిల్స్ లో నమోదైన విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోడ్ల మీదకు రావటానికి పలువురు భయపడిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రోజులో ఏకంగా 1658 పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరుతో హైదరాబాద్ కాస్తా.. హై‘డర్’ బాద్ గా మారిన పరిస్థితి. ఒకరోజులో పది కేసులు నమోదు కావటమే పెద్ద విషయంగా భావించిన స్థాయి నుంచి ఈ రోజున నమోదవుతున్న కేసుల లెక్కతో వణుకుపుతున్న పరిస్థితి.
రోజులో పది కేసు కాస్తా పాతిక.. యాభై.. వంద.. ఐదు వందలు.. ఇలా కేసుల నమోదు సంఖ్య పెరగటానికి చాలా రోజులు పడితే.. గడిచిన రెండు వారాల్లో మహమ్మారి స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల తీవ్రతనుచూస్తే వణుకు పుట్టేస్తోంది. శుక్రవారం రాత్రి కాస్త ఆలస్యంగా విడుదలైన బులిటెన్ చూసినోళ్లంతా ఒక్కసారిగా షాక్ తగిలిన పరిస్థితి. గడిచినకొద్ది రోజులుగా వెయ్యి దాటేందుకు కిందామీదా పడిన దానికి భిన్నంగా కట్టలు తెంచుకున్న గుర్రాల మాదిరి పాజిటివ్ కేసుల సంఖ్య దౌడు తీస్తున్న వైనం ఉలిక్కిపడేలా చేసింది.
బుధవారం వరకూ వెయ్యి దాటని కేసులు గురువారం వారం తొలిసారి తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి దాటేశాయి. అందులో హైదరాబాద్ మహానగర వాటా 998. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విడుదలైన రిపోర్టులో మహానగరంలోనే 1658 పాజిటివ్ కేసులు అంటే.. రోజులో పెరిగిన కేసులు ఏకంగా 660 అంటే.. దగ్గర దగ్గర 60 శాతానికి పైగా కేసుల రేటు పెరగటం. ఇంతే వేగంతో కేసుల నమోదు సాగితే.. రానున్న వారం రోజుల్లో పాజిటివ్ కేసుల లెక్క ఎంతగా పెరిగిపోతుందో అంచనా వేసేందుకే వణికే పరిస్థితి.
హైదరాబాద్ తర్వాత రంగారెడ్డిలో 56 కేసులు..మేడ్చల్ లో 44కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ తో పోలిస్తే.. ఈ పాజిటివ్ కేసులేమీ పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఏమైనా.. హైదరాబాద్ లెక్కలు ఉలిక్కిపడే స్థాయి నుంచి భయపడే స్థాయికి చేరుకున్నాయని చెప్పక తప్పదు.