2020లో స్వర్గధామంగా మారబోతున్న హైదరాబాద్

By Newsmeter.Network  Published on  1 Jan 2020 7:02 PM IST
2020లో స్వర్గధామంగా మారబోతున్న హైదరాబాద్

ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సౌకర్యాలు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, మౌలిక వసతులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అందుబాటులో ఉండే ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హైదరాబాద్ నగరానికి చెందిన ఎంతోమంది వృత్తి నిపుణులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు.

ప్రత్యేకించి హైదరాబాద్ నగరం ఐటీ సేవలకు విశ్వవిఖ్యాతిగాంచిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలో 2020 సంవత్సరంలో ఈ నగరం మరిన్ని సౌకర్యాలతో అలరాలబోతోంది. మరింత అందంగా ముస్తాబు కాబోతోంది. ఈ నగరంలో నివసించాలనుకునేవారి పాలిట ఓ రకంగా హైదరాబాద్ స్వర్గధామంగా మారబోతోందన్నమాట. ఆ వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త సంవత్సరంలో హైదరాబాద్ ను మరింత సౌకర్యవంతమైన నగరంగా మార్చేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సరికొత్త ప్రణాళికలతో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. పౌరులకు సౌకర్యాలను కల్పించే రంగాలైన విద్యుత్తు, మంచినీటి సరఫరా, రవాణా, మహిళలు, పిల్లల భద్రత మొదలైన అతి ముఖ్యమైన శాఖల అధికారులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2020లో తమ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు, నాణ్యతను పెంచేందుకు కృషిచేస్తున్నారు.

టిఎస్ జెన్ కో :

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కార్పొరేషన్ పెరుగుతున్న అవసరాలు, డిమాండ్ నకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు 2020లో విడతలవారిగా కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మణుగూరులో 1,080 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన కొత్త ప్లాంట్ ను త్వరలోనే ఏర్పాటు చేయబోతోందీ సంస్థ.

ఎన్టీపీసీకి చెందిన మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం 2020 అక్టోబర్ లో జరగబోతోంది. ఈ రెండు ప్లాంట్ల ఏర్పాటుతో నగరంలో విద్యుత్ వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా సప్లైనికూడా పెంచే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రస్తుతం 16,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఈ సంస్థకు ఉంది. మణుగూరు, ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణంతో ఈ సామర్ధ్యం 18,080 మెగావాట్లకు పెరుగుతుందని ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ మరియు ఎం.డి దేవులపల్లి ప్రభాకర్ రావ్ చెబుతున్నారు.

డెసింబర్ 31, 2019తో రైతులకు ఉచిత విద్యుత్తును అందించే పథకం ప్రారంభించిన మూడేళ్లు పూర్తయ్యిందని తెలంగాణ విద్యుత్ శాఖమంత్రి జి.జగదీష్ రెడ్డి తెలిపారు. విస్తృత స్థాయిలో వర్షాలు కురవడంవల్ల జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉండడంవల్ల హైడల్ విద్యుత్తు ఉత్పత్తి స్థాయి పెరిగిందని చెప్పారు. దీనివల్ల దాదాపుగా రూ.700 కోట్ల రూపాయలు విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి ఆదాఅయ్యాయని చెప్పారు.

హైదరాబాద్ మెట్రో

2019లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో దేశంలోనే అతిపెద్ద రెండో మెట్రోగా గుర్తింపును పొందింది. అమీర్ పేటనుంచి హైటెక్ సిటీవరకూ, ఉప్పల్ వరకూ, ఎల్బీ నగర్ వరకూ నడుస్తున్న మెట్రో నెట్వర్క్ విస్తృత స్థాయిలో ప్రజాభిమానాన్ని చూరగొంది.

డిజిటల్ ఫ్రెండ్లీ పేమెంట్ సదుపాయాలు మరింతగా ప్రజాభిమానం పెరగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. దీనివల్ల టెక్ సావీలు, యువత మెట్రోకి బాగా చేరువయ్యారు. జూబ్లీ బస్ స్టేషన్ కు అనుసంధానమై ఉండే మెట్రో కారిడార్ నిర్మాణాన్ని 2020లో పూర్తి చేస్తామని హెచ్ ఎమ్ ఆర్ ఎల్ మ్యానేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్ రెడ్డి చెప్పారు.

ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారాయన. అమీర్ పేట, పంజగుట్ట, హైటెక్ సిటీ, ఇర్రమ్ మంజిల్ స్టేషన్లు హ్యాంగౌట్ స్పాట్లుగా మారాయని, ఈ స్టేషన్ల చుట్టూ రిటైల్ వ్యాపారం, వివిధ సౌకర్యాలు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉండడం దానికి కారణమని తెలిపారు. మెట్రో రైళ్లలో లాంగ్ రూట్లలో ఎంటర్ టైన్ మెంట్ నుకూడా ఏర్పాటు చేశామనీ, ప్రయాణికులకు ఎక్కువశాతం సొంత ఇంటర్ నెట్ డేటాను వినియోగించాల్సిన అవసరం లేదని చెప్పారు.

జి.హెచ్.ఎమ్.సి :

కొత్త సంవత్సరంలో జి.హెచ్.ఎమ్.సి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ ని అమలు చేసేందుకు కృషి చేస్తోంది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. రూ. 23,000 కోట్ల రూపాయలతో ఈ ప్లాన్ సిద్ధమయ్యింది. 54 జంక్షన్లలో, 111 కిలోమీటర్ల పరిధిలో 66 కిలోమీటర్ల విస్తృతితో సరికొత్త కారిడార్ ని అభివృద్ధి చేయబోతున్నారు. దీనికితోడు 348 కిలోమీటర్లమేర రోడ్లను అభివృద్ధి చేయబోతున్నారు.

కొత్త సంవత్సరంలో నగరంలో గుంతలు, ఎత్తుపల్లాలుగా ఉన్న రోడ్లన్నింటినీ మరమ్మతులు చేసి సరిచేయబోతున్నారు. 55 ప్రపోజ్డ్ లింకు రోడ్ల అభివృద్ధికి, 35 స్లిప్ లింకు రోడ్ల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు అందజేసిన జీహెచ్ఎమ్సీ అనుమతికోసం నిరీక్షిస్తోంది.

ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు ఆమోదాన్ని పొందేందుకు రూపాయి టర్మ్ లోన్ కోసం బ్యాంకులతో ఒప్పందాలు చేసుకునే ప్రక్రియ తుది దశలో ఉన్నట్టు జిహెచ్ఎమ్ సి అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం చివరన ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టేందుకు నిర్ణయించిన ప్రాజెక్టుల్లో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది.

దీనిసాయంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పనులను జి.హెచ్.ఎం.సి పూర్తి చేస్తుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్(రూ.184 కోట్లు), రోడ్ నెంబర్ 45లో ఎలివేటెడ్ కారిడార్ (రూ.150 కోట్లు), షేక్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ (రూ.333.55కోట్లు), కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్లు (రూ.263.09కోట్లు ), బాలానగర్ గ్రేడ్ సెపరేటర్ (రూ.387కోట్లు), ఒవైసీ హాస్పిటల్ – బహద్దూర్ పుర (రూ.132కోట్లు) అంబర్ పేట్ ప్లైఓవర్ (రూ.270 కోట్లు), కెబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఫ్లైఓవర్లకు (రూ.436కోట్లు) సంబంధించిన పనులు పూర్తవుతాయి.

హెచ్.ఎమ్.డబ్ల్యు.ఎస్ & ఎస్.బి

కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టిన తరుణంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైబోర్డ్ రోజుకు మరో 172 గ్యాలన్ల మంచినీటి సరఫరాను పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం ఔటర్ రింగ్ రోడ్డునుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను నగరానికి తరలించే ప్రతిపాదనలు ఊపందుకుంటున్నాయి.

పది టిఎమ్ సి ల నీటిని జి.డి.డబ్ల్యు.ఎస్.పి ఫేజ్ – II ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నగరంలో పెరుగుతున్న మంచినీటి డిమాండ్ కు అనుగుణంగా సప్లైని కూడా పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సిటీ శివారు ప్రాంతాలకు విస్తరించగానే వాటర్ బోర్డ్ గోదావరి జలాలను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది.

హైదరాబాద్ లో మురుగునీరు, పారిశుద్ధ ప్రణాళికను బాగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం దృఢ సంకల్పం. దీని ద్వారా వర్షాలు బాగా కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, మామూలు సమయాల్లోకూడా మురుగునీటి పారుదల వ్యవస్థకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలన్నది దాని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. తద్వారా కాలుష్యాన్నికూడా నివారించడానికి వీలవుతుంది. దీనివల్ల ప్రజారోగ్యంకూడా మెరుగుపడుతుంది. ఇందుకోసం సివరేజ్ బోర్డ్ ఓ మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. 65 ఎస్టీపీలను నిర్మించాలని ఆ ప్రతిపాదనలో సివరేజ్ బోర్డ్ కోరింది.

డిజాస్టర్ రెస్పాన్స్ :

నగరంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు నేషనల్ బిల్డింగ్ కోడ్ ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించామని

తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్ చెబుతున్నారు. ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయని బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి ఇచ్చే ప్రసక్దతే లేదన్నారు. ఎప్పటికప్పుడు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తామని చెప్పారు.

మహిళలు – పిల్లల భధ్రత మరియు రక్షణ :

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు, పిల్లల భద్రతకోసం పోలీస్ వ్యవస్థ నగరంలో విస్తృత స్థాయిలో రక్షణ, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రజల సాయాన్నికూడా తీసుకునేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సైబర్ క్రైమ్ లను అదుపుచేయడం, ఆర్థిక నేరాలకు చెక్ పెట్టడం లాంటి ప్రధాన లక్ష్యాలపై మరింతగా దృష్టి సారించనుంచి పోలీస్ శాఖ.

విద్యార్థినులు, మహిళా ఉద్యోగినుల భద్రతకోసం సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ని నేర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. హైవే పెట్రోలింగ్ ను పెంచుతున్నారు. ముఖ్యంగా రిమోట్ ఏరియాల్లో పెట్రోలింగ్ కోసం డ్రోన్లను వినియోగించే వ్యవస్థ ఏర్పాటుకోసం ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. 100 సర్వీసుల్ని మరింత బలోపేతం చేస్తున్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. సరూర్ నగర్ లో ఇందుకోసం భరోసా సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలని తలపెట్టారు. మరో ఏడు కౌన్సిలింగ్ సెంటర్లనుకూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే లక్ష సీసీ కెమెరాలు ఉండగా ఇంకా భారీ స్థాయిలో సీసీ కమెరాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.

Next Story