30 అడుగుల బ్రిడ్జిపై కిందపడ్డ కారు.. ఒకరు దుర్మరణం.. నలుగురు సీరియస్‌

By అంజి  Published on  18 Feb 2020 4:11 AM GMT
30 అడుగుల బ్రిడ్జిపై కిందపడ్డ కారు.. ఒకరు దుర్మరణం.. నలుగురు సీరియస్‌

హైదరాబాద్‌: నగరంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి భరత్‌నగర్‌ బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సోహెల్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు కూకట్‌పల్లి నుంచి సనత్‌నగర్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదుపు తప్పిన కారు భరత్‌ నగర్‌ బ్రిడ్జిపై నుంచి ప్రశాంత్‌నగర్‌ వైపు పడింది.

క్షతగాత్రులను స్థానికులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారందరూ నెహ్రూనగర్‌కి చెందిన వ్యక్తులు అని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు దాదాపు 30 అడుగుల మీది నుంచి కింద పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. కాగా అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గత రెండు నెలల క్రితం గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై అతివేగం వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టి ఫ్లైఓవర్‌ నుంచి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. అదుపు తప్పిన కారు ఫ్లైఓవర్‌ పై మీద నుంచి.. అదే సమయంలో కింద ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది.

Next Story
Share it