హైదరాబాద్‌: రోడ్డెక్కిన సిటీ బస్సులు

By సుభాష్  Published on  25 Sept 2020 8:38 AM IST
హైదరాబాద్‌: రోడ్డెక్కిన సిటీ బస్సులు

కరోనా కారణంగా గత ఆరు నెలలుగా హైదరాబాద్‌ నగరంలో నిలిచిపోయిన సిటీ బస్సులు ఈ రోజు రోడ్డెక్కాయి. కోవిడ్‌ మహమ్మారి కారణమా అని 185 రోజులుగా స్తంభించిపోయిన సిటీ బస్సులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. మొత్తం సిటీ బస్సులు 3200 ఉండగా, 25 శాతం బస్సులు గ్రేటర్‌లో తిరుగుతాయి. రాణిగంజ్‌ డిపోలో 225 సిటీ బస్సులు ఉండగా, వాటిలో25శాతం అంటే 55 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు అన్ని బస్సులను శానిటేషన్‌ చేసి భౌతిక దూరం పాటిస్తూ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. నగర శివారు, గ్రామాలు, పట్టణాలకు కూడా సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది. అన్‌లాక్‌4.0 ప్రారంభమైనప్పటి నుంచి పేద, సామాన్య ప్రజానీకం నగరంలో ప్రయాణించేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్న విషయం తెలిసిందే.

కాగా, హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉండే రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, బండ్లగూడ, హకీంపేట, మియాపూర్‌, ఫలక్‌నుమా, హయత్‌నగర్‌ వంటి ప్రాంతాల డిపోల నుంచి బస్సులు బుధవారమే ప్రారంభమయ్యాయి. ఈ డిపోల నుంచి 12 బస్సుల చొప్పున బస్సులను నడుపుతున్నారు. నగర శివారు గ్రామాల్లోని ప్రయాణికుల కోరిక మేరకు మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

గ్రేటర్‌లో 3798 బస్సులు

కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 3798 ఆర్టీసీ బస్సులున్నాయి. గత ఏడాది సమ్మె కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొన్ని సర్వీసులను పక్కనపెట్టేశారు. మిగిలిన 3298 బస్సులతో గ్రేటర్‌ బస్సులు 9 లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ 34 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.

గ్రేటర్‌ ఆర్టీసీకి రోజువారి ఆదాయం రూ.3.50 కోట్లు

కాగా, ఈ బస్సుల ద్వారా గ్రేటర్‌ ఆర్టీసీకి రోజువారి ఆదాయం రూ.3.50 కోట్లు సమకూరుతుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ పూర్తిగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్‌లాక్‌ 4లో భాగంగా మెట్రో రైళ్లు సైతం పట్టాలెక్కాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బస్సులను తిప్పేందుకు అధికారులు సిద్దమయ్యారు.

Next Story