మానవ హక్కులు ఏం చెబుతున్నాయి..!
By సుభాష్
- నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినం
దేశంలోపుట్టిన ప్రతి వ్యక్తికి స్వేచ్చగా జీవించే హక్కు ఉంది. ప్రతి మానవుడికి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందనే చెప్పాలి.హక్కుల ఉల్లంఘించే హక్కు ఎవ్వరికి లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో హక్కులను ప్రభుత్వాలే కాలరాస్తున్నాయి. మావన హక్కుల గురించి చాలా మందికి తెలియని విషయాలుంటాయి. మానవుల మాన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. ఈ హక్కులు పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి లభిస్తాయి. నిత్యం ప్రపంచ వ్యాప్తంగా అత్యాచారాలు, మారణహోమాలు, ఎన్నో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు, దేశంలో జరుగుతున్న వ్యక్తిగత విబేధాలు, ఇతర కారణాల వల్ల మనుషుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఈరోజుల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు మామూలైపోయాయి. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన ద్వారా మానవాళికి మానవ హక్కులను అందించింది. అందుకే డిసెంబర్ 10ని ‘అంతర్జాతీయ మానవహక్కుల దినం’గా అన్నిదేశాల్లో జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదులను సత్వరం విచారించడానికి కోర్టులతో పాటు మనదేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మానవహక్కుల కమిషన్‌లు ఏర్పాటు అయ్యాయి.
మానవ హక్కులు ఇవే:
1. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
2. చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు
3. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాల్లో పర్యటించే హక్కు.
4. సురక్షిత ప్రాంతంలో ఒంటరిగా జీవించే హక్కు.
5. వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచాలు, ఇతర ఇబ్బందుల నుండి రక్షణ పొందే హక్కు
6. ఒక అభియోగం ఆపాదించబడినప్పుడు, పక్షపాతరహితంగా విచారణ పొందే హక్కు.
ఇవికాక, జీవించే హక్కు, సామాజిక భద్రతాహక్కు, భావ స్వాతంత్య్రహక్కు, విద్యాహక్కు, పిల్లలు ఆడుకొనే హక్కు, ప్రజాస్వామ్య హక్కు, కాపీరైటు హక్కు, జాతీయత హక్కు ఇలా ఎన్నో హక్కులున్నాయి. ఇవి ఉల్లంఘించబడినపుడు ప్రత్యేక కోర్టులను, కమిషన్‌లను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
ఇక మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) ఏర్పాటు చేశారు. మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ కమిషన్ ఎంతో కృషి చేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఈ కమిషన్ ఆ వ్యవహారాలకు సంబంధించి దర్యాప్తు చేపడుతుంది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు, ఇతర సమాచారం, పత్రికల్లో, మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా మానవహక్కుల కమిషన్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతుంది. ఇతరులను విచారించి సాక్షాధారాలను సేకరిస్తుంది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ 2016-17 సంవత్సరాలకు గాను ఇచ్చిన వివరాల ప్రకారం... మన దేశంలో అత్యధిక మానవ హక్కుల ఉల్లంఘన కేసులు ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ప్రకారం దేశమంతా దాదాపుగా ప్రతి సంవత్సరం 90 వేలకు పైగా కేసులు నమోదు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.