అబుదాబి యువరాజు తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన వల్ల గాయపడిన ఒక చిన్ని మనసుని ఆనందంలో ముంచెత్తారు. యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ గత వారం అబుదాబి లోని అధ్యక్ష భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పదుల సంఖ్యలో చిన్నారులు అక్కడికి వెళ్లారు. చేతిలో యూఏఈ జెండా పెట్టుకుని వరుసగా నిలబడి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజు చిరునవ్వుతో చిన్నారులకు షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్లారు. అదే వరుసలో ఉన్న అయేషా కూడా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంది. కానీ కొంచంలో ఆమెకు ఆ ఛాన్స్ మిస్ అయింది. దీనితో అయిషా ముఖం చిన్నబుచ్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజు షేక్ హ్యాండ్ మిస్సవడంతో.. ఆ బాలిక చాలా బాధపడిన విషయం వీడియోలో ఆమె ఎక్స్‌ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది. ఇదే వీడియో యువరాజు మహమ్మద్ బిన్ దాకా చేరింది. దీనితో ఆ బాలికను ఆయన సర్ప్రైస్ చేశారు. బాలికకు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆమె ఇంటికే వెళ్లి ఆశ్చర్యపరిచారు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషపరిచాడు. కాసేపు చిన్నారితో ముచ్చటించారు. చిన్నారి పట్ల యువరాజు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒక చిన్నారి మనసును కష్టపెట్టకూడదన్న ఆలోచన ఉన్న యువరాజు నిజంగానే యువరాజు అంటున్నారు నెటిజన్లు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్