తప్పిన శకుంతలాదేవి ఎన్నికల లెక్క ..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 1 Aug 2020 4:11 PM ISTమానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన గణిత, ఖగోళ శాస్త్రజ్ఞురాలు శకుంతలాదేవి పేరు చిరపరిచితం. ప్రపంచ వ్యాప్తంగా గణితావధానాలు నిర్వహించి మానవ గణన యంత్రంగా పేరు తెచ్చుకున్నారు. ఈ విషయంగా పలు పుస్తకాలు రచించిన శకుంతలాదేవి తన మేధాశక్తితో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. బెంగళూరులో ఓ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శకుంతలాదేవి తన అసాధారణ ప్రతిభతో ఉన్నత స్థానాలు అందుకున్నారు.
అయితే తను రాజకీయాలను అంచనా వేయడంలో విజయం సాధించలేకపోయారు. గణితంలాగానే రాజకీయాల్లోనూ సమీకరణలు కచ్చితంగా ఉంటాయని అనుకున్నారే గానీ.. రాజకీయాల్లో రెండు రెళ్ళ ఆరు అని తెలుసుకోలేక పోయారు. తన తెలివితేటల్ని ప్రదర్శిస్తూ.. సెలిబ్రిటీగా మారిన శకుంతలాదేవి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మరింత చేరువ కావచ్చని, పిల్లల్లో గణితంపై ఆసక్తి పెంపొందింప జేయవచ్చని అనుకున్నారు.
అయితే దేశరాజకీయాలు ఆమె అనుకున్నంత సీదాసాదాగా ఉండవు. ప్రతి ఒక్క సందర్భం ఇన్‌బిట్వీన్ లైన్స్.. అంటే లోతుగా చూడాల్సి ఉంటుంది. అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాజకీయసత్యం శకుంతలాదేవికి బాగా తెలిసొచ్చింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నియోజకవర్గం నుంచి తనూ పోటీకి దిగారు. ఇందిరాగాంధీ రాజకీయ దిగ్గజం. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లో వచ్చిన ఆమె సుదీర్ఘకాలం ప్రధానిగా వ్యవహరించారు. అనేక ఒడిదొడుకులను చూశారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టి అపకీర్తీ మూటగట్టుకున్నారు.
అలాంటి ఇందిరాగాంధీ బరిలో ఉండగా పోటీకి దిగడంలోనే శకుంతలాదేవి రాజకీయ పరిజ్ఞానంలో పరిణితి సాధించలేదని తేటతెల్లమైంది. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 6వేల పైచిలుకు ఓట్లు సాధించి తొమ్మిదో స్థానంలో నిలవగలిగారు. అప్పట్లో శకుంతలాదేవి రాజకీయాల్లోకి రావడమేంటని చాలామంది మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓటమి పాలయ్యాక రాజకీయాలు అంటే ఏంటో ఆమెకు తెలిసొచ్చింది.
రాజకీయకోణం మాట అటుంచితే మిగిలిన విషయాల్లో శకుంతలాదేవి ఓ నడిచే గణితమని చెప్పవచ్చు. అందుకే ఆమె జీవిత కథను చిత్రంగా తెరక్కెంచారు. ఇందులో శకుంతలాదేవిగా విద్యాబాలన్ నటించారు. ఓటీటీలో ఇవాళ విడుదలైన చిత్రంలో విద్యాబాలన్ నటన బాగుందన్న టాక్ వినవస్తోంది. ఇంతకూ ఓ సినిమాగా తీసేంత ఆసక్తి కర అంశాలు ఆమె జీవితంలో ఏమున్నాయి?
సర్కస్‌లో గణితం షో
శకుంతలాదేవి కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఈమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక ఓ సర్కస్ కంపెనీలో చేరారు. శకుంతలాదేవి చిన్ననాడే బాలమేధావిగా పేరు తెచ్చుకున్నారు. తన మూడో ఏట తండ్రితో పేకాడేది. గణిత సంఖ్యలను కంఠస్థం చేయగల సామర్థ్యం ఆమెలో ఉందని మొదట గ్రహించిన వారు ఆమె తండ్రి.
ఆమె తన 5వ ఏటనే క్యూబ్ మూలాలు లెక్కించగల నైపుణ్యం సాధించారు. శకుంతలాదేవి తండ్రి పనిచేసే సర్కస్‌లో తన గణిత నైపుణ్యాలను ప్రదర్శించేది. ఆ తర్వాత తండ్రి ఏర్పాటు చేసిన రోడ్డుషోలలో పాల్గొని ఖ్యాతి పొందారు. ఈ విధంగా తండ్రితోపాటు తనూ కుటుంబానికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండేవారు. తన ఆరో ఏటనే మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రదర్ళనలిచ్చారు.
బీబీసీలో ప్రసార జర్నలిస్టు లెస్లీ మిచెల్‌తో కలిసి ఓప్రత్యేక కార్యక్రమం నిర్వహిం చారు. అయితే ఓ దశలో మిచెల్ ఆమె సమాధానంతో విభేదించారు. ఆమె తెలిపిన సంఖ్య వివాదాస్పదం అన్నారు. అయితే పరిశీలన తర్వాత శకుంతలాదేవి చెప్పిందే కరెక్టు.. బిబిసీది తప్పని బాహటంగా అంగీకరించారు. శకుంతలా దేవి తన గణనా సామర్థ్యాన్ని పలు దేశాల్లో పర్యటించి ప్రదర్శించారు. ఆమె తన తండ్రితో కలిసి 1944లో లండన్ వెళ్ళారు. 1950 లో ఐరోపా, 1976లో న్యూయార్క్ నగరంలో ప్రదర్శనలిచ్చారు.
1988 బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మనస్తత్వ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ వద్ద అధ్యయనం చేయడానికి వెళ్ళారు. జెన్సన్ పెద్ద సంఖ్యలున్న గణిత సమస్యలతో సహా పలు పనులలో ఆమె నైపుణ్యాన్ని పరిశీలించారు. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్‌తో పోటీ పెట్టారు. ఈ పోటీలో ఆమ కంప్యూటర్‌నే ఓడించేశారు. గత శతాబ్దంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారమో చిటికెలో చెప్పేవారు. శకుంతలా దేవి ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యూ, పజిల్స్ టు పజిల్ యూ, మాథెబ్లిట్ పుస్తకాలు రచించారు.
శకుంతలాదేవి 1960లో కోల్‌కతాకు చెందిన ఐఏఎస్ అధికారిణి పరితోష్ బెనర్జీని వివాహమాడారు. అయితే బెనర్జీ స్వలింగ సంపర్కం గురించి వెల్లడి కావడంతో ఆ వివాహబంధం నుంచి తక్కువ సమయంలోనే విడిపోయారు. ఈ ఘటనతో ఆమె కుంగిపోలేదు. దీన్నే ప్రేరణగా తీసుకుని మానవత్వం గురించి లోతుగా అధ్యయనం చేశారు. తదనంతరం ఆమె రాసిన ది వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్ పుస్తకంలో స్వలింగ సంపర్కం అనైతికం అనే అంశాన్ని సవాల్ చేశారు. తమ లైంగిక ప్రాధాన్యత ఆధారంగా ఎదుటి వారిని ఎగతాళి చేసేవారు అనైతికులని ఆమె అనేవారు.
శకుంతలాదేవి తనను తాను అంతర్ముఖత్వంతో అన్వేషించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అందుకే ఆమె తన ప్రసంగాల్లో తన జీవితం గురించే ప్రస్తావించేవారు. శకుంతలాదేవి జ్యోతిషంలో విజయం సాధించారు. తను వంటల పుస్తకాలతోపాటు నవలలు కూడా రాసేవారు. తనను అందరూ హ్యూమన్ కంప్యూటర్ అంటుంటే ఎందుకో ఇష్టపడేవారు కాదు. మనిషి మనసును కంప్యూటర్‌తో పోల్చడం సరికాదని ఆమె అభిప్రాయం. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కిడ్నీ,గుండె సమస్యలతో 2013లో తన 83వ ఏట బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.
అసామాన్య ప్రతిభాసంపత్తి కలిగిన శకుంతలాదేవి జీవితం చాలా ఆసక్తి కరం. అందుకే ఆమె జీవితాన్ని బయోపిక్‌గా సినిమా తీశారు. విద్యాబాలన్ శకుంతలాదేవిగా ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో సన్యా మల్హోత్రా, అమిత్‌సాద్,జిషుసేనగుప్తాల నటించారు. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ప్రొడక్షన్స్ విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించారు. అనుమీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 31న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.