లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మరో భారీ ప్రమాదం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Sept 2020 7:00 PM IST
లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మరో భారీ ప్రమాదం..

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో గత నెలలో జరిగిన ఘోర ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోగా ముందే మరో సారి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్‌ ఆయిల్‌, వాహనాల టైర్లను నిల్వచేసే గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు ఆకాశంలో కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతనే ఎంత నష్టం వాటిల్లింది అనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో బీరుట్ ప్రజలు మరోమారు భయంతో వణికిపోయారు.

కాగా.. ఆగస్టు 4న బీరుట్‌లో పోర్టులో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. గోదాములో భారీగా నిల్వచేసిన అమ్మోనియం నైట్రేట్‌ ఒక్కసారిగా పేలడంతో యావత్‌ నగరం ధ్వంసం కాగా.. భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించాయి. అప్పుడు జరిగిన ప్రమాదంలో దాదాపు 190 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6500 మందికి పైగా గాయాలపాలయ్యారు. అణుబాంబు విస్పోటనంతో సరిసమానంగా భారీ పేలుడు సంభవించడంతో ఇప్పటికీ ఆ నగరం కోలుకోలేదు.

Next Story