లెబనాన్‌ ‌లో భారీ పేలుళ్లు.. 70 మంది మృతి.. 4వేల మందికి పైగా గాయాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 9:59 AM IST
లెబనాన్‌ ‌లో భారీ పేలుళ్లు.. 70 మంది మృతి.. 4వేల మందికి పైగా గాయాలు

లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. నాలుగు వేల మంది పైగా గాయపడినట్లు ఆదేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు సమాచారం. పేలుడు అనంతరం సుడులు సుడులుగా దట్టమైన పొగ ఎగిసిపడింది. సమీపంలోని భవనానికి మంటలు విస్తరించడంతో తీవ్రత మరింత పెరిగింది. అనేక భవంతుల్లో కిటీకీలు ఇళ్లలో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన పై కప్పులు ముక్కలయ్యాయి.

పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా పేలుడు శబ్దాలు బీరూట్ కు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దీవుల వరకూ వినిపించడం గమనార్హం. ఇది ఓ అణుబాంబు తీవ్రతను గుర్తు చేసిందని, నౌకాశ్రయం ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మాక్రోవీ యర్గానియన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలను చూడలేదని ఆయన అన్నారు. 1975 నుంచి 1990 మధ్య పదిహేను సంవత్సరాల పాటు సివిల్ వార్ సాగినా, ఇంతటి పేలుళ్లు జరగలేదని అన్నారు.



Next Story