ప్రపంచం దృష్టంతా 'హౌడీ మోదీ' పైనే!
By న్యూస్‌మీటర్ తెలుగు
‘హౌడీ మోదీ' మెగా వేడుకకు రంగం సిద్ధమైంది! భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘హలో, హౌ డు యు డు’ (హౌడీ) అంటూ ఆప్యాయంగా పలకరించి, ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు అగ్రరాజ్యం ఎదురుచూస్తోంది.
ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి వేదిక అయిన ఎన్‌ఆర్జీ సాకర్ స్టేడియం పరిసరాల్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. 'నమో అగైన్' టీ షర్ట్‌లు ధరించిన నిర్వాహకులు, వాలంటీర్లు..నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
భారత్ - అమెరికా దేశాల మధ్య స్నేహబంధానికి ప్రతీకగా స్టేడియం వద్ద రెండు దేశాల జాతీయ పతాకాలతో 200 పైగా కార్లతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు 600 మంది నిర్వాహకులు, 1500మంది వాలంటీర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఇండియా , అమెరికా దేశాధినేతలు మోదీ, ట్రంప్‌లు పాల్గొననుండటంతో ఈ కార్యక్రమం పట్ల ఇరు దేశాల ప్రజలే కాకుండా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9.15 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. మూడు గంటల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. మోదీ పాల్గొనే ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో 50వేల మంది భారత సంతతి ప్రజలు హాజరుకానున్నారు. అమెరికా చరిత్రలోనే పోప్ మినహా ఏ విదేశీ నేత సభకు ఈ స్థాయిలో ప్రజలు హాజరుకాలేదు.