రోగ నిరోధక శక్తి పెంచుకోండిలా... ఆయుర్వేదిక్ ఫార్మూలా చెప్పిన ప్రధాని మోదీ
By సుభాష్ Published on 4 April 2020 7:10 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజలకు ఈ వైరస్ వల్ల ఎన్నో అపోహాలు, అనుమానాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారు అధిక సంఖ్యలో వృద్దులే ఉన్నారు. వారికి వయసు మీద పడటంతో వివిధ వ్యాధులు దరి చేరుతాయని, వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, అందులో కరోనా సోకడం వల్ల వారి మరణానికి కారణమని చెబుతున్నారు వైద్య నిపుణులు. అందుకే ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల కొన్ని వైరస్‌లు మనపై దాడి చేయకుండా తట్టుకోగలుగుతామని అంటున్నారు. రోగ నిరోధక శక్తితోనే కరోనా వైరస్‌ను ఎదుర్కొవచ్చు. కేంద్ర ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యూనాని, సిద్ధ, హోమియోపతి, ఆయూష్ మంత్రిత్వశాఖ ఈ చిట్కాలను రూపొందించింది. వాటిని ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేదిక్ ఫార్మూలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
రోజంతా కూల్ వాటర్, మామూలు వాటర్ తాగకుండా కాస్త వేడి నీళ్లను తాగుతుండాలి. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలుండవు.
రోజూ పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. 150 మిల్లీలీటర్ల పాలలో అరచెంచా పసుపు కలిపి ప్రతీ రోజు రెండు పూటలు తాగినట్లయితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
అలాగే ప్రతీ రోజు 30 నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణామాయం, మెడిటేషన్ చేయాలి. ఇక వంటలో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిని తప్పకుండా ఉపయోగించాలి. వాటి వల్ల నిరో నిరోధక శక్తి పెరుగుతుంది.
తులసీ, దాల్చినచెక్క, సొంఠి, మిరియాలు, డ్రై గ్రేప్స్‌తో చేసిన టీ లేదా డికాక్షన్ రోజూ కనీసం రెండు సార్లు తీసుకుంటే మంచిది. నిమ్మరసం కలిపితే ఇంకా బాగుంటుంది.
అలాగే గొంతునొప్పి ఉన్నా.. పొడిబారినా పుదీనా ఆకులు, వామ వాసన చూడాలి. లవంగాలు పొడి చేసుకుని చక్కెర, తేనెలో కలిపి ప్రతీ రోజు రెండు, లేదా మూడు సార్లు తాగాలి.
జలుబు ఉంటే ముక్కు రంధ్రంలోకి నువ్వుల నూనె, కొబ్బరి నూనె పూయాలి. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి.
ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ థెరపీ ప్రతీ రోజూ రెండుసార్లు చేయాలి. ఇలా చేసినట్లయితే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని ఆయుర్వేదం చెబుతోంది.