పక్షులు కింద పడకుండా చెట్లపైన ఎలా నిద్రిస్తాయి..!
By సుభాష్ Published on 19 April 2020 6:33 AM ISTపక్షులు రోజంతా ఎటు తిగిరినా రాత్రి కాగానే చెట్ల కొమ్మలపై చేరుకుంటాయి. వాటి నిద్ర కూడా చెట్ల కొమ్మలపైనే. చాలా పక్షులు చెట్ల కొమ్మలపైనే నిద్రపోతుంటాయి. కానీ అవి కింద పడకుండా ఎలా నిద్రిస్తాయనే సందేహం పెద్దగా వచ్చి ఉండదు. చీకటి పడగానే చెట్ల కొమ్మలపై వాలిపోతాయి. మనకు రాత్రి సమయం కాగానే నిద్ర ఎలా వస్తుందో.. పక్షులకు కూడా అంతే రాత్రి కాగానే ఎక్కడున్న చెట్లపైకి చేరుకుంటాయి. మనలాగే పక్షులకు కూడా నిద్ర అవసరం.
రాత్రి కాగానే వాటంతట అవే ఒక్కడున్న చెట్లపైకి చేరిపోతుంటాయి. కొన్ని పక్షులు నివాసానికి గూళ్లు కట్టుకుని నిద్రిస్తుంటాయి. మరి కొన్ని పక్షులు చెట్ల కొమ్మలే వాటికి ఇల్లు లాంటివి. కొన్ని పక్షులైతే కొమ్మలపైనే నిలబడి నిద్ర పోతుంటాయి. ఒక్కోసారి ఒంటికాలిమీదే నిద్రపోయినా కిందపడకుండా ఉంటాయి. అయితే పక్షులు చెట్లపై నిద్రిస్తున్న సమయంలో కిందపడకుండా ఉండడానికి కారణం వాటి కాళ్లల్లో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం అని నిపుణులు చెబుతున్నారు.
పక్షుల కాళ్లల్లో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలు ఉంటాయి. వాటి కాళ్లలో తొడ భాగంలోని కండరాల నుంచి మోకాళ్ల ద్వారా కాలి చివరి భాగం వరకూ, అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలి వేళ్ల కింది భాగం వరకూ ఉంటాయి.
కొమ్మలపైన వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేటట్లు చేస్తుంది. అప్పుడు కాళ్లల్లోని నరాలు వాటంతట అవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకుని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. పక్షులు నేరుగా కాళ్లు సాచే వరకూ ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు చెట్లపై నిద్రిస్తున్నా కిందపడకుండా ఉండిపోతాయి. ఒక వేళ పక్షులు కొమ్మలపైనే చనిపోయినా కూడా అలాగే ఉంటాయి తప్ప కిందపడిపోవు. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను అంత గట్టిగా పట్టుకుంటాయన్నమాట.