ఆసుపత్రి బయట బెడ్స్ మీద ఎంతో మంది పేషెంట్స్ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఆసుపత్రి ముందు ఇలాంటి పరిస్థితి ఉందంటూ వాట్సప్ లో వీడియోను షేర్ చేస్తున్నారు. కోవిద్-19 పేషేంట్ల సంఖ్య ఎక్కువవ్వడం.. లోపల బెడ్స్ ముందుగానే నిండిపోవడంతో ఇలా పేషేంట్లు బయటే పడిగాపులు కావాల్సి వస్తోందంటూ వార్తలను వైరల్ చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ:
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలోని ఆసుపత్రిలో పరిస్థితి ఇదంటూ వైరల్ అవుతున్న వీడియో 'పచ్చి అబద్దం'. ఈ వీడియోకు హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదు.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో పాకిస్థాన్ కు చెందినది. భారత్ లో హైదరాబాద్ కు చెందినది కాదు.
పాకిస్థాన్ లో కోవిద్-19 పేషెంట్స్ సంఖ్య పెరిగిపోతోందని.. కానీ అక్కడ సరైన సదుపాయాలు లేవంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలను షేర్ చేశారు. అయితే ఇది కూడా 'తప్పుడు సమాచారమే'.
ఈ వీడియో లాహోర్ సర్వీస్ ఆసుపత్రికి చెందినది. జూన్ 12, 2020న లాహోర్ సర్వీస్ ఆసుపత్రి లోని ఐసీయు విభాగంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో లోపలి వారిని బయటకు తీసుకుని వచ్చారు. ఆసుపత్రి లోకి తీసుకుని వెళ్లాల్సిన రోగులు కూడా కొద్దిసేపు బయటనే ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన వార్తా సంస్థలు ఈ విషయాన్ని ప్రసారం చేశాయి. parhlo.com లో ఈ ఘటనకు సంబంధించిన ఆర్టికల్ ను రాశారు. ‘Patients Waited Outside Lahore Hospital Due To Fire – They Are Not COVID positive’ అని తెలిపారు.
జూన్ 12, 2020న చోటుచేసుకున్న ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను, వార్తలను ఈ కింది లింక్ లలో చూడొచ్చు.
https://gulfnews.com/world/asia/pakistan/pakistan-video-of-patients-waiting-outside-after-lahore-hospital-catches-fire-causes-confusion-online-1.1592321600347
AFP కూడా ఈ వీడియోకు తప్పుడు సమాచారం అంటగడుతున్నారని తెలిపింది.
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఆసుపత్రి బయట కూడా కోవిద్ పేషెంట్స్ ఉన్నారని చెబుతున్నదాన్లో ఎటువంటి నిజం లేదు. ఇది పాకిస్థాన్ కు చెందిన వీడియో.. వారు కోవిద్-19 పేషెంట్స్ కూడా కాదు. సామాజిక మాధ్యమాల్లో హైదరాబాద్ అంటూ వైరల్ అవుతున్నది 'పచ్చి అబద్ధం'.