త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు , న్యాయమూర్తుల జీతాలు, పెన్షన్‌ల చెల్లింపులను నిర్లక్ష్యం చేస్తూ ఎన్నికల ఉచితాలకు నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశంలోని న్యాయమూర్తులకు సరిపడా జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై ఆందోళనలు లేవనెత్తిన అఖిల భారత న్యాయమూర్తుల సంఘం చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, ఎజి మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఇటీవలి ఉదాహరణలను ఉటంకిస్తూ.. బిజెపి నేతృత్వంలోని మహాయుతి ప్రకటించిన మహారాష్ట్ర 'లడ్కీ బహిన్' పథకం, ఎన్నికల్లో గెలవడానికి ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేసిన ఆర్థిక వాగ్దానాలను బెంచ్ ఎత్తి చూపింది .
''న్యాయమూర్తులకు జీతాలు చెల్లించే విషయానికి వస్తే, రాష్ట్రాలు తరచుగా ఆర్థిక పరిమితులను సూచిస్తాయి. అయితే, ఎన్నికల సమయంలో ఇచ్చిన 'లడ్కీ బహిన్'తో పాటు ఇతర పథకాలకు కచ్చితమైన సొమ్మును ప్రకటిస్తారు. ఢిల్లీలో ఎన్నికల్లో గెలవడానికి ఓ పార్టీ రూ. 2,100 ఇస్తామంటే.. మరో పార్టీ రూ. 2,500 చెల్లిస్తామంటూ ఆర్థిక వాగ్దానాలను చేస్తున్నాయి'' అని ధర్మాసనం పేర్కొంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) "ముఖ్య మంత్రి మహిళా సమ్మాన్ యోజన"ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ రూ. 2,100 సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చింది.
ఆప్‌ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కాంగ్రెస్ కూడా ఇదే విధమైన పథకాన్ని ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వస్తే ఢిల్లీలోని మహిళలకు నెలవారీ రూ. 2,500 సహాయం ఇస్తామని హామీ ఇచ్చింది. న్యాయాధికారుల జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం.. ఆర్థిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటుందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 17, నామినేషన్ల పరిశీలన జనవరి 18వ తేదీలోపు జరుగుతుంది.