కూల్చివేతపై బులిటెన్ ఇస్తాం.. మీడియాకు అనుమతి ఇవ్వలేం..!
By తోట వంశీ కుమార్ Published on 24 July 2020 1:19 PM GMT
తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారించింది. సచివాలయం కూల్చివేత వివరాలతో మీడియాకు బులిటెన్ ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే.. కూల్చివేతలను కవరేజ్‌కు చేయడానికి మీడియా ఎందుకు అనుమతి ఇవ్వరో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. జర్నలిస్టులకు అనుమతిస్తే వారికి ప్రమాదాలు జరగవచ్చని, అందరూ గుమిగూడి కొవిడ్ నిబంధనల ఉల్లంఘటన జరగొచ్చని ఏజీ కోర్టుకు తెలిపారు. బులిటెన్ వివరాలు సమగ్రంగా ఉండవని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్చకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని పిటిషనర్ పేర్కొనగా.. పరిస్థితుల ప్రభావంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. సచివాలయ పరిసర ప్రాంతాలలో వెళ్లి కూల్చివేతలను కవరేజ్ చేస్తున్న అడ్డుకున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రైవేటు ప్రాంతాల్లో వెళ్లి కవరేజ్ చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది .
అలానే ప్రైవేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియాను అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కాగా.. నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో వస్తుందని, అది నిజమో లేదో తెలియాల్సిన అవసరం ఉందని పిటీషనర్ పేర్కొన్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంకి సంబంధించి కోట్ల రూపాయల సంపదను లైవ్ లో చూపించిన మీడియాకు ఇప్పుడు ఎందుకు మీరు కట్టడి చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అనుకున్నామన్న హైకోర్టు, అనుమతి ఇవ్వక పోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుందని పేర్కొంది. రేపు పిటిషన్ అర్హత పై ప్రభుత్వం నిర్ణయం చూసి తుది తీర్పు ఇస్తామని తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.